కేసీఆర్ నిర్ణయాలపై సర్కార్ ఫోకస్.. నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు నిర్మాణాలే!

by Disha Web Desk 2 |
కేసీఆర్ నిర్ణయాలపై సర్కార్ ఫోకస్.. నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు నిర్మాణాలే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు రెడీ అవుతున్నది. అవినీతికి పాల్పడిన అధికారులు, సహకరించిన పాలకులపై చర్యలు తీసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. ఇప్పటికే ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టుల్లో ఎంక్వయిరీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్.. త్వరలో మరిన్ని అంశాలపై విచారణ జరిపేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. మిషన్ భగీరథ స్కీమ్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానంలో ప్రభుత్వం ఉన్నది.

మేడిగడ్డపై త్వరలో జ్యుడిషియల్ కమిటీ

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. డిజైన్ లో లోపం, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. దీనిపై సమగ్ర విచారణ కోసం రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని భావిస్తున్నది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థ బ్యారేజీ కుంగుబాటుకు కారణాలపై అంతర్గత విచారణ జరిపిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై సమీక్షలు నిర్వహించారు. త్వరలో జ్యుడిషయల్ ఎంక్వయిరీకి ఆదేశించేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు.

మిషన్ భగీరథపై ఫోకస్

ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనే పేరుతో మిషన్ భగీరథ స్కీమ్ ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకోసం సుమారు రూ. 54 వేల కోట్లు ఖర్చు చేసినట్టు అధికార వర్గాల్లో ప్రచారం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా స్కీమ్ కు అదనంగా పైపులు వేశారే తప్పా, కొత్తగా నీటిని సరఫరా చేయలేదని విమర్శలు వచ్చాయి. అయితే మిషన్ భగీరథ స్కీమ్ పేరుతో నాటి పాలకులు పెద్ద ఎత్తున కమీషన్లు దోచుకున్నట్టు కాంగ్రెస్ లీడర్లు అప్పట్లోనే ఆరోపణలు చేశారు. ఈ పథకంలో జరిగిన అక్రమాలను బయటికి తీసేందుకు విచారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది.

పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలపై విచారణ

కేసీఆర్ హయాంలో భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఉపయోగించిన పలు మిషన్ల కొనుగోళ్లలో రూ. వేలాది కోట్లు చేతులు మారినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తున్నది. పాత టెక్నాలజీ ఉన్న మిషన్లను ఓపెన్ మార్కెట్లో లభ్యమయ్యే రేట్ల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారనే విమర్శలున్నాయి. దీంతో అప్పటి కొనుగోళ్లపై విచారణ చేసేందుకు జ్యుడిషయల్ విచారణకు అదేశిస్తామని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. అలాగే ఛత్తీస్ గఢ్ తో జరిగిన విద్యుతో కొనుగోళ్ల ఒప్పందంపై కూడా విచారణ జరిపించాలని నిర్ణయించారు.

పోలీసు టవర్స్, సెక్రటేరియట్ నిర్మాణాల పైనా ఎంక్వయిరీ

పోలీసు టవర్స్, సెక్రటేరియట్ నిర్మాణాల్లో సైతం అక్రమాలు చోటుచేసుకున్నట్టు కాంగ్రెస్ సర్కారు అనుమానం వ్యక్తం చేస్తున్నది. టెండర్లు పిలిచిన సమయంలో అంచనా వేసిన ఖర్చు, నిర్మాణం పూర్తయ్యే నాటికి రెట్టింపు అయినట్టు విమర్శలున్నాయి. అంచనా వ్యయాన్ని పెంచడం వల్ల కొందరికి ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. నిజానికి నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయా? లేదా? అని తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అలాగే జిల్లా కలెక్టరేట్ల నిర్మాణాల్లో కూడా అక్రమాలు జరిగాయని, వాటిపై కూడా విచారణకు ఆదేశించాలని యోచనలో ఉన్నట్టు టాక్ ఉంది.



Next Story

Most Viewed