ముగిసిన కాంగ్రెస్ బస్సు యాత్ర.. ఢిల్లీకి పయనమైన ఎంపీ రాహుల్ గాంధీ

by Disha Web Desk 19 |
ముగిసిన కాంగ్రెస్ బస్సు యాత్ర.. ఢిల్లీకి పయనమైన ఎంపీ రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్సు యాత్ర ముగిసింది. శనివారం ఆర్మూర్‌లో సభ అనంతరం ఆయన ఢిల్లీకి పయనం అయ్యేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మూడు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా బుధవారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ.. తొలిరోజు రామప్ప ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప వద్ద నుంచే కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత ములుగు జిల్లా రామంజపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. గురువారం భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి సభల్లో మాట్లాడారు.

శుక్రవారం జగిత్యాల, ఆర్మూర్ సభల్లో రాహుల్ ప్రసంగించారు. మూడు రోజుల పాటు విజయవంతంగా సాగిన విజయభేరీ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల బాణాలు సంధించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే‌నని తూర్పారబట్టారు. తనకు తన కుటుంబానికి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉందంటూ సెంటిమెంట్ రెయిజ్ చేసే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజలతో మమేకం అవుతూ క్యాడర్‌లో కొత్త జోష్ నింపారు రాహుల్.

రాహుల్ సమక్షంలో చేరికలు:

ఈ పర్యటనలో పలువురు ముఖ్యనేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బీజేపీకి రాజీనామా చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, బీఆర్ఎస్‌కు చెందిన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో పాటు మరికొంత మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో వైపు గురువారం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ భేటీ కీలకంగా మారింది.

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా పగడ్బందీ ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడిన కోదండరామ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజేఎస్‌తో పొత్తు లేదా విలీనంపై ఇవాళ రాహుల్ గాంధీ, కోదండరామ్ మధ్య చర్చలు తుది దశకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed