కాళేశ్వరం నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ.. నాలుగు నెలల డెడ్‌లైన్

by Disha Web Desk 2 |
కాళేశ్వరం నిర్మాణంపై అధ్యయనానికి కమిటీ.. నాలుగు నెలల డెడ్‌లైన్
X

దిశ, తెలంగాణ బ్యూరో/వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల డ్యామేజీ, పటిష్టతపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆరుగురితో కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధక్ష్యతన ఏర్పడిన ఈ కమిటీలో మరో ఐదుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. నాలుగు నెలల్లో ఈ మూడు బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ-రీసెర్చ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్టుమెంటు సెక్రటరీ ఫిబ్రవరి 13న రాసిన లేఖకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మూడు బ్యారేజీలను ఫిజికల్‌గా స్టడీ చేయడంతో పాటు సంబంధిత ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరపాల్సిందిగా పేర్కొన్నారు. బ్యారేజీలకు సంబంధించిన హైడ్రాలిక్, స్ట్రక్చరల్, జియో టెక్నికల్ అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ప్రాజెక్టు డాటా, డ్రాయింగ్స్, డిజైన్ మెమొరాండంలు, ఇప్పటివరకు చేసిన టెస్టులు, సైట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు, బ్యారేజీ ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు తదితరాలను పరిశీలించాలన్నారు. డిజైన్‌తో పాటు నిర్మాణానికి వాడిన మెటీరియల్, క్వాలిటీ కంట్రోల్ గురించి కూడా అధ్యయనం చేయాలన్నారు. ఈ నిర్మాణంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులు, ప్రైవేటు నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్లు తదితరులతో ఆపరేషన్, మెయింటెనెన్స్ గురించి కూడా చర్చించాలని సూచించారు.

మొత్తం ఏడు అంశాలపై నిశితంగా స్టడీ చేయాలని పేర్కొన్న డ్యామ్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్.. బ్యారేజీల డిజైన్ రూపకల్పన సమయంలో అవలంబించిన ఫిజికల్, మేథమాటికల్ మోడల్స్ ను స్టడీ చేయాలన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు ఎందుకు పగుళ్ళు వచ్చాయి, ఎందుకు కుంగిపోయాయి, స్ట్రక్చర్‌కు ఇబ్బందులు ఎందుకు తలెత్తాయి తదితరాలను స్టడీ చేసి నాలుగు నెలల్లో రిపోర్టును సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ అధ్యయనం తర్వాత ఇంకా లోతుగా స్టడీ చేయాల్సి వస్తే ఏ తీరులో ఉండాలో సూచించడంతో పాటు ఈ డ్యామేజీని ఇక్కడితోనే నిలిపివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇకపైన మరింత డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ తదితరాలను కూడా నివేదికలో పొందుపర్చాలని సూచించారు. ఏదేని పరిస్థితుల్లో మరికొంతమందిని ఈ కమిటీలోకి చేర్చుకోవాల్సి వస్తే అథారిటీకి సమాచారం ఇచ్చి చైర్మన్ నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొన్నారు.



Next Story

Most Viewed