ఉమ్మడి పాలమూరు జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్.. పర్యటనల తేదీలు ఫిక్స్!

by Disha Web Desk 4 |
Telangana CM KCR Plans to establish National Media
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో తమ పట్టు సడలకుండా ఉండేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తామని పలు సందర్భాలలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించడం.. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పార్టీకి దూరం కావడం .. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో జాగ్రత్త పడకుంటే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఉమ్మడి జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

కాంగ్రెస్, ఇతర పార్టీల ఎత్తుగడలను దెబ్బతీసేలా కేసీఆర్ వ్యూహాలు రూపొందించి అమలుపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించుకొని జనం మధ్యకు రాకముందే జాగ్రత్త పడేందుకు బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా పై తనకు ఉన్న ప్రేమను వెల్లడించుకోవడంతో పాటు.. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణను సాధించానని పదేపదే చెబుతూ వచ్చారు. ఇటీవల రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ విస్తృత పర్యటనలు జరిపినప్పటికిని అవి చెప్పుకోదగిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రచార సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రత్యేక షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది.

ఆరు నియోజకవర్గాలలో సీఎం సభలు

ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలలో మొదటి విడతగా ఆరు నియోజకవర్గాలలో సీఎం పర్యటించనున్నారు. ఆయా చోట్ల బహిరంగ సభలు నిర్వహించి ఉమ్మడి పాలమూరు జిల్లాపై తమ పట్టు సడల లేదన్న సంకేతాలు ఇతర పార్టీలకు పంపేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన జడ్చర్లలో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. అక్టోబర్ 26న నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలలో జరిగే సభలకు హాజరుకానున్నారు. నవంబర్ 6న గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలలో జరిగే బహిరంగ సభలకు రానున్నారు.

మిగతావి మలి విడతలో..

ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొదటి విడతలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహించే బహిరంగ సభలు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మలివిడతలో ఉమ్మడి జిల్లాలో మిగిలిపోయిన దేవరకద్ర, మహబూబ్ నగర్, వనపర్తి, కొల్లాపూర్, అలంపూర్, కల్వకుర్తి, కొడంగల్ , అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్వహించే బహిరంగ సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.


Next Story

Most Viewed