పాలమూరుపై సీఎం ఫోకస్.. వారికి కేసీఆర్ కీలక ఆదేశాలు

by Disha Web Desk 4 |
పాలమూరుపై సీఎం ఫోకస్.. వారికి కేసీఆర్ కీలక ఆదేశాలు
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఆగిపోయిన పాలమూరు-రంగారెడ్డి పనులలో ఇక కదలిక రానుంది. పాలమూరు కన్నీటిని తుడవడానికి, వలసలు ఆపడానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. 8 సంవత్సరాలవుతున్న పనులు పూర్తి కాకపోవడం... పలు రకాల ఆటంకాలు ఎదురు కావడంతో గత సంవత్సరన్నర కాలంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.. వచ్చే ఎన్నికలలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రతిపక్షాల విమర్శల అస్త్రాలుగా ఉపయోగపడే పరిస్థితులు నెలకొన్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుంటే తమకు ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎట్టకేలకు స్పందించారు. సచివాలయాన్ని ప్రారంభించిన తరువాత మొదటి సమీక్ష సమావేశాన్ని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి , అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల ప్రగతి గురించి అధికారుల ద్వారా తెలుసుకొని మిగిలిన పనులను చేపట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కోవాలని కోరారు.

రిజర్వాయర్లలో 30శాతం నీటిని నింపండి..

ఇప్పటికే దాదాపు పూర్తయిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను వచ్చే వర్షాకాలంలో 30 శాతం నీటితో నింపాలని సీఎం ఆదేశించారు. అంతలోపు చిన్న పనులు, విద్యుత్, మోటార్ల ఏర్పాటు ఇతర వైనా పనులు ఉంటే పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం..

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉదండాపూర్, కరివేన రిజర్వాయర్ల నుంచి కెనాళ్ల నిర్మాణం కోసం అవసరమైన పనులను తక్షణమే చేపట్టాలన్నారు. పనులను మూడు నుంచి నాలుగు భాగాలు చేసి కాంట్రాక్టర్లకు అప్పగించాలని సూచించారు. భూసేకరణ, తదితర పనులను వేగవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన నిధుల కేటాయింపులు, ఉత్తర్వులు వెంటనే విడుదలవుతాయని కేసీఆర్ వెల్లడించారు.

కోయిల్ సాగర్-కేఎల్ఐకి మరిన్ని నిధులు..

ఉమ్మడి పాలెం జిల్లాలోని కోయిల్‌సాగర్, కేఎల్ఐ ప్రాజెక్టుల పెండింగ్ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, నివేదికలను వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు పాలమూరు జిల్లా ఎంపీలు రాములు, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఆలవెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, కృష్ణమోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed