ప్రజా దర్బార్ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Satheesh |
ప్రజా దర్బార్ నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస నిర్ణయాలలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో ఇవాళ జోతిరావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు అంచనాలకు మించి ప్రజలు ఫిర్యాదులు, వినతి పత్రాలు ఇచ్చేందుకు పోటెత్తారు. దీంతో ఇకపై ప్రజాదర్బార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం జిల్లాకు ఓ అధికారిని నియమించాలని, వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాలను పర్యవేక్షణ బాధ్యతలను ఓ సీనియర్ అధికారికి అప్పగించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రజాదర్బార్‌లో రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఉండేలా ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజాదర్బార్ మొదటి రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆయన సెక్రటేరియట్‌కు వెళ్లిపోయారు. అనంతరం మంత్రి సీతక్క ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed