తొందరపడి చిక్కుల్లో పడొద్దు.. సొంత ఎమ్మెల్యేలకు రేవంత్ కీలక సూచన

by GSrikanth |
తొందరపడి చిక్కుల్లో పడొద్దు.. సొంత ఎమ్మెల్యేలకు రేవంత్ కీలక సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకవైపు ప్రభుత్వ పాలనను చక్కదిద్దే దిశగా వ్యూహాత్మకంగా వెళ్తున్న సీఎం రేవంత్.. పార్టీలో కూడా డిసిప్లేన్ వాతావరణం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వాన్ని ముందుకు కొనసాగించేందుకు ప్రత్యేక ప్రణాళికను తయారు చేయడమే కాకుండా, పార్టీ ఎమ్మెల్యేలను కూడా మంచి మార్గంలోకి తీసుకువెళ్లేలా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన శాసన సభ్యులకు సీఎం ప్రాథమికంగా తగిన సూచనలు చేశారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి? నియమ, నిబంధనలు ఎలా ఉంటాయి? పబ్లిక్ సమస్యలపై ఎలా మాట్లాడాలి? ప్రజలతో మమేకమై పనిచేయడం ఎలా? పార్టీ కార్యక్రమాలు ఎలా సక్సెస్ చేయాలి? తదితర అంశాలపై సీఎం క్లారిటీ ఇచ్చారు. నూతన ఎమ్మెల్యేలు సరైన మార్గంలో వెళ్లేందుకు మంత్రులు సహకరించాలని సీఎం కోరారు. జిల్లాల వారీగా కొత్త ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అవగాహన పరచాలని సీఎం మంత్రులకు సూచించారు.

వ్యక్తిగత, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా..

ప్రతిపక్షంలో సుదీర్ఘకాలం పాటు అనుభవం కలిగిన నేతగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా సీఎం తాను గైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యేల ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ముందస్తు జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. పూర్తిస్థాయిలో స్డడీ చేసిన తర్వాత స్పందిస్తేనే ప్రజలకు మేలు జరగడమే కాకుండా, పార్టీకి కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుందని కేర్ తీసుకుంటున్నారు. ఏ చిన్నపాటి తప్పు దొర్లినా సోషల్ మీడియా ఎఫెక్ట్ తో వ్యక్తిగత ఇమేజ్ తోపాటు పార్టీకి కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత నేతలు చెబుతున్నారు. ఇతర పార్టీల పాలనతో పోల్చితే కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ ఓ మార్క్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారు.

ఆరు నెలలు మానిటరింగ్..?

2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ పై 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 25 మందికి పైనే నూతనంగా శాసనసభలో అడుగు పెట్టారు. కొందరు స్థానిక సంస్థల్లో వివిధ పోస్టుల్లో పనిచేసినప్పటికీ, మరికొంతమంది నేరుగా ఎమ్మెల్యే టికెట్ పొంది గెలిచారు. దీంతో వీళ్లంతా సీనియర్ల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లాలని పార్టీ సూచించింది. అసెంబ్లీతో పాటు బయట ఎక్కడ మాట్లాడినా అవగాహనతో వ్యవహరించాలని ఆదేశాలిచ్చింది. ముఖ్యంగా అసెంబ్లీలో క్రమశిక్షణగా వ్యవహరిస్తూనే, ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నది. ఆరునెలల పాటు అబ్జర్వేషన్ చేస్తే చట్ట సభల్లో వ్యవహరించాల్సిన తీరుపై క్లారిటీ వస్తుందని సీఎం కూడా మంత్రుల ద్వారా ఎమ్మెల్యేలకు తెలియజేశారు. టాపిక్స్ పై లోతుగా అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. సభలో సీనియర్లు మాట్లాడుతున్న విధానాన్ని పరిశీలిస్తూనే, సబ్జెక్టు అనాలసిస్ పై నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు. అప్పుడే ప్రజల్లో గుర్తింపుతో పాటు పాలనపైనా పట్టు వస్తుందని పార్టీ పేర్కొన్నది.

Next Story