ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన.. రంగంలోకి సీఎం రేవంత్

by Disha Web Desk 2 |
ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన.. రంగంలోకి సీఎం రేవంత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం తమకు శాపంగా మారిందని ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇవాళ సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న ఈ సమావేశంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత ప్రయాణ నిర్ణయంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఇప్పటికే పలు చోట్ల నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆటో డ్రైవర్లతో సమావేశం కాబోతుండటం ఆసక్తిగా మారింది. కాగా ఆటో డ్రైవర్ల తరపున నిరసనలకు బీఆర్ఎస్ అనుబంధ ఆటో యూనియన్లు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం కోసం కార్మిక విభాగం నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమిటీని ఏర్పాటు చేసినట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed