కేంద్రంపై రెచ్చిపోయిన కేసీఆర్.. నాందేడ్ సభలో సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేంద్రంపై రెచ్చిపోయిన కేసీఆర్.. నాందేడ్ సభలో సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నాందేడ్ బహిరంగ సభలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని అన్నారు. 75 ఏళ్లలో.. 70 ఏళ్లు కాంగ్రెస్‌, బీజేపీలే దేశాన్ని పాలించాయని తెలిపారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే అంబానీ అంటుంది, మరొక పార్టీ అధికారంలోకి వస్తే అదానీ అంటుందని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం జోకిన్ ఇండియాగా మారిందని సెటైర్లు వేశారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లోని చిన్న చిన్న పట్టణాల్లో చైనా బజార్లు ఉన్నాయని గుర్తుచేశారు. మాంజా ధారం నుంచి జాతీయ జెండాల వరకు చైనా నుంచి దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటని సీరియస్ అయ్యారు. మన్ కీ బాత్ పేరుతో ప్రజల్ని వంచిస్తున్నారని వెల్లడించారు. ఇది రాజకీయం కాదు.. జీవన్మరణ సమస్య అని చెప్పుకొచ్చారు.

రైతులు ఇంకెన్నాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాలని కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉన్నదని అడిగారు. ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన ఈ రెండు పార్టీ విధానాలే రైతుల ఆత్మహత్యలకు కారణమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉందని, చాలా దేశాల్లో 5 వేల టీఎంసీల కెపాసిటీ కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. 75 ఏళ్లు దాటినా ఇంకా మన దేశంలో అలాంటి భారీ ప్రాజెక్టులు ఎందుకు లేవని అసహనం వ్యక్తం చేశారు. మన దేశంలో రిజర్వాయర్ల సమస్య కాదు.. జన వివాదాలు, ట్రిబ్యూనళ్లు పెరిగిపోయాయని అన్నారు. రైతులు నాగలి పట్టి పొలం దున్నడం కాదని, కలం చేతపట్టి చరిత్రలు తిరగరాయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చాక కరువు ప్రాంతాలకు సైతం అద్భుతంగా న్యాయం జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఒకప్పుడు కరెంట్ లేక, తాగునీరు లేక తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ, నేడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. రైతులు 50 మోటార్లు పెట్టుకున్నా అడ్డుచెప్పడం లేదని తెలిపారు. రైతు చనిపోయిన నాలుగు రోజుల్లోనే బీమా డబ్బులు పంపి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని అన్నారు. ఎలాంటి కష్టం లేకుండా రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొంటోందని వెల్లడించారు. ఒక్క తెలంగాణలో ఇంత సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యపడదని ప్రశ్నించారు. దేశంలో కావాల్సినంత సహజ సంపద ఉందని, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ, వాడుకునే తెలివి కేంద్రానికి లేదని విమర్శించారు. అభివృద్ధిని పక్కన పెట్టి మత విద్వేశాలు, హింసను రెచ్చగొట్టి బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం కొన్ని పార్టీలకు అలవాటుగా మారిందని అన్నారు. జెండా రంగులను చూసి జనం మోసపోతున్నారని తెలిపారు.

Next Story

Most Viewed