కౌన్ బనేగా MLC..? అభ్యర్థుల ఎంపిక CM కేసీఆర్ మల్లగుల్లాలు

by Disha Web Desk 19 |
కౌన్ బనేగా MLC..? అభ్యర్థుల ఎంపిక CM కేసీఆర్ మల్లగుల్లాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. నామినేటెడ్ అయినా.. పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయినా.. ఎమ్మెల్యే టికెట్ అయినా ఏదైనా ముందస్తుగానే కేసీఆర్ ప్రకటిస్తారు. కానీ ఇద్దరు ఎమ్మెల్సీల పదవికాలం నేటితో ముగుస్తున్నా ఇంకా అభ్యర్థులను డిక్లేర్ చేయలేదు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ పెండింగ్‌లో పెట్టడంపై పార్టీలో చర్చనీయాంశమైంది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారు. ఏదైనా నిమిషాల్లో సమస్యను పరిష్కరించే కేసీఆర్.. గడువు ముగుస్తున్నా అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. నేటి(ఈనెల 27)తో గవర్నర్ కోటాలో ఎన్నికైన రాజేశ్వర్ రావు(క్రిస్టియన్), ఫరూఖ్ హుస్సేన్( ముస్లిం మైనార్టీ) ఇద్దరి పదవికాలం పూర్తవుతోంది. ఈ రెండు స్థానాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రెండుమైనార్టీ స్థానాలు కావడంతో ఎవరిని ఎంపిక చేయాలని, ఎవరైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వస్తుందనేది క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కాగా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు. వారిని నియమించిన సందర్భంలోనే గవర్నర్ కోటాలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం ఇచ్చారు. కానీ ఆదిశగా చర్యలు చేపట్టలేదు. అభ్యర్థుల ఎంపిక జరుగలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలోనూ పేర్లను ఖరారు చేస్తారని తమపేరు ఉంటుందని ఆశావాహులు భావించారు. కానీ అధినేత ఫైనల్ చేయకపోవడంతో నిరాశకు గురయ్యారు.

రెండుస్థానాలకు రెండుపదుల ఆశావాహులు

గవర్నర్ కోటాలో ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 20 మందికిపైగా ఆశావాహులు ఉన్నారు. ఇప్పటికే ఎవరికి వారుగా మంతనాలు చేసుకుంటున్నారు. కొంతమంది కేసీఆర్‌తో, మరికొంతమంది ఆశావాహులు కేటీఆర్ సన్నిహితులతో మంతనాలు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కొంతమందికీ, వివిధపార్టీల నుంచి చేరిన సమయంలో మరికొంతమందికి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కొన్నేళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు.

ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, మాజీ టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, నాయకులు అరికల నర్సారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కర్నె ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్, దాసోజు శ్రవణ్‌ కుమార్‌, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రామ్ నర్సింహ గౌడ్, క్రిస్టియన్ మైనార్టీ నేతలు విద్యాస్రవంతి, రాయ్ దిన్ రోచ్ పేర్లను పరిశీలించినట్లు సమాచారం.

వీరితో పాటు మరికొంతమంది పేర్లను సైతం పరిశీలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేశ్వర్ రావు, ఫరూఖ్ హుస్సేన్‌కు మరోసారి అవకాశంపై నేతలతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. విద్యాస్రవంతి, దాసోజు శ్రవణ్, భిక్షమయ్యగౌడ్ పేర్లు ముందువరుసలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటించకపోవడం, అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్ లకు ఎవరూ సన్నిహితంగా ఉన్నారని ఆరా తీస్తు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

గతం పునరావృతం కాకుండా..

ప్రగతిభవన్, రాజ్ భవన్ మధ్య దూరం అలాగే కొనసాగుతూనే ఉంది. విమర్శలు ప్రతివిమర్శలు పరిపాటిగా మారాయి. ఈ తరుణంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచీ వ్యవహరిస్తున్నది. అభ్యర్థుల పేర్లను గవర్నర్‌కు పంపిస్తే ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గతంలో పాడి కౌశిక్ రెడ్డిని స్పోర్ట్స్ కోటాలో ఎమ్మెల్సీగా కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది. అయితే ఆయన కేసులు ఉన్నాయని మూడు నెలలు గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో ఆయన స్థానంలో మధుసూదనచారికి అవకాశం కల్పించింది.

తిరిగి ఎమ్మెల్యే కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసింది. ఇలాంటి ఘటనతిరిగి పునరావృతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్రకసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేవారు పార్టీకి ఏవిధంగా ఉపయోగపడతారు.. ఏ సామాజిక వర్గంను దగ్గరకు తీసుకొని రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మాత్రం అధిష్టానానికి మాత్రం సవాల్ గామారింది.

Read more:

వేర్ ఈజ్ ఎమ్మెల్సీ కవిత.. నెలన్నరగా నో అడ్రస్!

Focus: ఆ జిల్లాకు సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి పర్యటన

Next Story