బిగ్ న్యూస్: డైలామాలో KCR.. కర్ణాటక రిజల్ట్స్‌తో టికెట్ల కేటాయింపుపై గులాబీ బాస్ మల్లగుల్లాలు!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: డైలామాలో KCR.. కర్ణాటక రిజల్ట్స్‌తో టికెట్ల కేటాయింపుపై గులాబీ బాస్ మల్లగుల్లాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణలో టికెట్ల కేటాయింపుపై గులాబీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. సిట్టింగులపై ఉన్న వ్యతిరేకతను అధిగమించకపోతే మళ్లీ పవర్‌లోకి వస్తామో లేదోననే ఆందోళన అధికార పార్టీని వెంటాడుతున్నది. అయితే కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన ఫార్ములాను అమలు చేసి, కొత్త ముఖాలను రంగంలోకి దింపితే ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపై సీఎం సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది. కర్ణాటకలో బీజేపీకి వచ్చిన ఫలితాలు ఇక్కడ బీఆర్ఎస్‌కు రిపీట్ అయితే.. మొదటికే మోసం వస్తుందని అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో కర్ణాటకలో బీజేపీ ఓటమికి గల కారణాలను సీఎం కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

టికెట్ల కేటాయింపుపై మల్లగుల్లాలు

పనితీరు మార్చుకోకపోతే తోక కట్ చేస్తానని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌లో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దీంతో సుమారు 40 మంది సిట్టింగులను తప్పిస్తారనే చర్చ జరిగింది. కానీ కర్ణాటకలో బీజేపీ టికెట్ల కేటాయింపు విషయంలో ఎంచుకున్న పద్ధతిని ప్రజలు స్వాగతించలేదు.

అక్కడ 53 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, కొత్తవారిని బరిలోకి దింపింది. కానీ బీజేపీ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చారు. కొత్తగా టికెట్లు ఇచ్చిన వారిలో ఆరేడు మంది మినహా మిగతా వారంతా ఓడిపోయారు. అయితే ఇక్కడ కూడా సుమారు 40 మంది సిట్టింగులను మార్చితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారేమోనని అనుమానం సీఎం కేసీఆర్‌ను వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

సిట్టింగులకు ఇవ్వొద్దనే వాదనలు..

వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయి. చాలా చోట్ల ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులు చేసే అరాచకాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. ఈసారి వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగులను మార్చితే పార్టీకి ప్రయోజనమేనని చాలా మంది వాదిస్తున్నారు. ఏ ఏ ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉందో గ్రామాల వారీగా లెక్కలతో సహా వివరిస్తున్నట్టు తెలిసింది. పాత వారికే మళ్లీ టికెట్టు కేటాయిస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నట్టు సమాచారం.

వ్యతిరేకత తగ్గించడంపై గురి

గత కొన్ని వారాలుగా సీఎం కేసీఆర్ సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఈ సమయంలో వారి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న నెగిటివ్, పాజిటివ్ అంశాలను వారితో చర్చిస్తున్నారు. ఏఏ మండలాల్లో వ్యతిరేకత ఉన్నది? ఏ వర్గాల్లో నెగిటివ్ ఉన్నది? అనే విషయాలను వివరిస్తూ, వారిని అలర్ట్ చేస్తున్నారు.

కొందరికైతే పనితీరు మార్చుకోవాలని నేరుగా హెచ్చరిస్తునట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే సర్వే రిపోర్టుల ఆధారంగా మాత్రమే టికెట్లు కేటాయించాలనే నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకుని ఎలక్షన్ షెడ్యూలు వచ్చేలోపు నిర్వహించే ఫైనల్ సర్వేలో నెగిటివ్ రిపోర్టు ఉన్న సిట్టింగులను పక్కన పెట్టి, కొత్తవారికి టికెట్లు ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది.

Also Read: జాతీయ రాజకీయాలపై కర్ణాటక ఫలితాల ప్రభావమెలా!?

Next Story

Most Viewed