హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

by Disha Web Desk 12 |
హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో కేంద్రం అప్రమత్తమైంది.ఈ నేపథ్యంలోనే రేపటి (ఏప్రిల్‌ 6) హనుమాన్‌ జయంతి ఉత్సవాలకు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఈ మేరకు హనుమాన్ జయంతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

‘హనుమాన్‌ జయంతి ఏర్పాట్ల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పండుగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మతసామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి’అని హోంశాఖ రాష్ట్రాలను కోరింది.

కాగా, శ్రీరామనవమి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనల దృష్ట్యా కోల్‌కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హనుమాన్‌ జయంతి ఉత్సవాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

Next Story

Most Viewed