రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

by Disha Web Desk 12 |
రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కులవృత్తులు చేసుకుంటున్న బీసీలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించే స్కీమ్‌పై క్యాబినెట్ సబ్ కమిటీ విధివిధానాలను సోమవారం ఖరారు చేయనున్నది. లబ్ధిదారుల ఎంపికకు అనుసరించాల్సిన అర్హతలపై సచివాలయంలో శనివారం భేటీ అయిన కమిటీ మరింత లోతుగా చర్చించడానికి సోమవారం కూడా సమావేశం కావాలని నిర్ణయించింది. స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించనున్నది. మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని సబ్ కమిటీలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాసగౌత్, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పలు కోణాల నుంచి చర్చించారు. అధికారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు.

ఈ స్కీమ్‌కు రాష్ట్రంలో ఎంత మంది బీసీలు లబ్దిదారులుగా ఉంటారు, వారికి అవసరమైన సాయం అందించడానికి ఏ మేరకు ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది తదితర పలు అంశాలను చర్చించారు. విధివిధానాలను రూపొందించడానికి అధికారుల నుంచి పలు అంశాల్లో వివరాలను తీసుకున్నారు. చితికిపోయిన కులవృత్తులకు ఆసరా కల్పించడంతో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న బీసీలకు ఆర్థికంగా చేయూతనందించడానికి ఈ స్కీమ్‌కు ప్రభుత్వం దశాబ్ది వేడుకల సందర్భంగా శ్రీకారం చుట్టనున్నది.

అప్పటికల్లా నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ రూపొందించే బాధ్యతను క్యాబినెట్ సబ్ కమిటీకి ముఖ్యమంత్రి అప్పగించారు. లబ్ధిదారులకు తలా లక్ష రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రాణి కుముదిని, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


Next Story