'ఉప ఎన్నిక బీజేపీ, టీఎర్ఎస్ కుట్రలో భాగమే..'

by Dishafeatures2 |
ఉప ఎన్నిక బీజేపీ, టీఎర్ఎస్ కుట్రలో భాగమే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, టీఎర్ఎస్ కుట్రలో భాగంగానే మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని టీపీసీసీ ప్రచార క‌మిటీ ఛైర్మన్ మ‌ధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడుతుందని, తిరిగి అధికారంలోకి వస్తుందని టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు భ‌య‌ప‌డుతున్నాయని అన్నారు. వరంగల్ రాహుల్ గాంధీ సభ తర్వాత యువత కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద ఎత్తున ఆకర్షిత‌మ‌వుతోందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తున్నారని అన్నారు.

మొన్నటి వరకు ముందస్తు ఎన్నికల అంటూ హడావుడి చేశారని, ఉన్నట్టుండి మునుగోడు ఉప ఎన్నికను తీసుకువచ్చారన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రాగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించడం అన్ని కుట్రలో భాగమన్నారు. కేవలం ఐదు నిమిషాల్లోనే రాజీనామాను ఆమోదించడం జీవో విడుదల చేయడం జరిగిందని అన్నారు. బీజేపీకి టీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు. ఉప ఎన్నికల తేదీ కూడా వాళ్లే ప్రకటిస్తున్నారని, అసలు ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఉందా లేదా అని ప్రశ్నించారు.

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై కొట్లాడుతున్నట్టు నాటకాలాడుతున్నారని తెలిపారు. పార్లమెంట్‌లో విద్యుత్ సంస్కర‌ణ‌ల బిల్లు వ‌చ్చిప్పుడు స‌భలో ఒక్క టీఆర్ఎస్ ఎంపీ లేడన్నారు. దీంతో రెండు పార్టీలు ఒక్కటేన‌ని చెప్పుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం వల్లే విద్యుత్ సంస్కరణ బిల్లు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు వెళ్ళిందన్నారు.

ఈ నెల 13న మునుగోడులో కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16 నుంచి మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారని, ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర నేతలంతా మునుగోడులోనే జయంతి వేడుకల్లో పాల్గొంటారని, ఆ రోజు మునుగోడులోని 175 గ్రామాల్లో కాంగ్రెస్ నేతల పర్యటనలు చేస్తారని వెల్లడించారు.

మునుగోడులో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు డేట్ ఫిక్స్



Next Story

Most Viewed