TS Polls 2023 : ఖమ్మం పాలిటిక్స్ పై బీఆర్ఎస్ పోస్టుమార్టం

by Disha Web Desk 9 |
TS Polls 2023 : ఖమ్మం పాలిటిక్స్ పై బీఆర్ఎస్ పోస్టుమార్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్ఎస్ పార్టీకి గుబులు పట్టుకుంది. ఆ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిట్లో విజయం సాధించగలమని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పక్కన పెట్టడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఆయనతోపాటు మెజార్టీ బీఆర్ఎస్ కేడర్ వలస వెళ్లే ప్రమాదం ఉన్నట్టు టాక్ ఉంది. దీంతో నష్టనివారణ కోసం ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.

తుమ్మల, పొంగులేటి, భట్టి కలిస్తే..

మాజీ మంత్రి సీనియర్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు విషయంలో తప్పు చేశామని అభిప్రాయం పార్టీ లీడర్లలో నెలకొన్నది. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మలకు టికెట్ ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని ముందుగానే చెప్పి, బుజ్జగించేందుకు కేసీఆర్ ప్రయత్నించ లేదు. కనీసం ఆ బాధ్యతలను కేటీఆర్, హరీశ్ ల్లో ఎవరికో ఒకరికి అప్పగించి నచ్చచెప్పేందుకు చొరవ తీసుకోలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన తుమ్మల పార్టీ వీడి, ఉమ్మడి జిల్లాలో తన సత్తా ఏంటో చూపేందుకు సిద్ధం అయ్యారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ఏకమైతే పది స్థానాల్లో ఒకటైనా బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ఆ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో పట్టుకోసం ఆరా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్లలో ఎవరిని పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందో లెక్కలు వేస్తున్నట్టు పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన మండల స్థాయి కాంగ్రెస్ లీడర్లు సైతం పార్టీ మారేందుకు విముఖత చూపుతున్నట్టు సమాచారం.

తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని అసహనంలో కమ్మ సామాజిక వర్గం ఉన్నట్టు టాక్ ఉంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వారం తర్వాత కమ్మ కుల సంఘానికి చెందిన కొందరు కీలక నేతలు హైదరాబాద్ లో సమావేశమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదారు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం కష్టమని టాక్ ఉంది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధ్యక్షుడు తాతా మధు కుల సంఘం నేతలను బుజ్జగించేందుకు ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed