జీవన్ రెడ్డిని మంత్రిగా చూడాలనుంది: BRS MLC

by Disha Web Desk 2 |
జీవన్ రెడ్డిని మంత్రిగా చూడాలనుంది: BRS MLC
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బిడ్డ పీవీకి కాంగ్రెస్ హై కమాండ్ చేసిన అన్యాయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడితే తప్పేముందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ కించపరిచింది అని చెప్పే క్రమంలో పీవీని అవమానించిన తీరును హరీష్ రావు వివరించారన్నారు. పీవీ కాంగ్రెస్ వాది కాదనడం లేదన్నారు. అయితే కాంగ్రెస్ వాదిగా పీవీని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తించలేదని ఆరోపించారు. పీవీకి అవమానకర రీతిలో అంత్యక్రియలు జరిగాయని, దివంగత కాంగ్రెస్ పీఎంలకు ఢిల్లీలో స్మారక స్థలాలు ఉన్నాయని, కానీ తెలంగాణ బిడ్డ పీవీ స్మారక స్థలం ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. పీవీ శతజయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా కేసీఆర్ నిర్వహించారని, అప్పుడు కాంగ్రెస్ వాళ్లు అడిగారా? అని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు.


సీలేరు విద్యుత్ కేంద్రంతో పాటు 7 మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారనడంలో అర్ధం లేదన్నారు. దానికి వ్యతిరేకంగా అప్పుడు పోరాడిందే బీఆర్ఎస్సే అన్నారు. అప్పుడు 70-80 మంది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో ఉన్నారని, అయినా తెలంగాణకు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్‌కు అప్పుడు కేవలం కేకే మాత్రమే రాజ్యసభలో ఉన్నా గళం వినిపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై 7 మండలాలు లాక్కున్నారని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ గురించి కాంగ్రెస్ ఎంపీలు అడగలేదన్నారు. కాళేశ్వరం అవినీతి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు కానీ.. కోచ్ ఫ్యాక్టరీ గురించి అడగలేదన్నారు. కేంద్రం బియ్యం కొనమని అంటే కాంగ్రెస్ మాట్లాడలేదని విమర్శించారు. పోరాటం చేసింది బీఆర్ఎస్.. పదవుల కోసం పెదవులు మూసుకుంది కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. హరీష్ రావు‌ను తిడితే మంత్రి పదవి వస్తుందని జీవన్ రెడ్డి అనుకుంటున్నట్టున్నారని, కాంగ్రెస్‌లో సీనియర్‌గా జీవన్ రెడ్డికి మంత్రయ్యే హక్కు ఉందన్నారు. చాలా మంది పార్టీలు మారారు కానీ జీవన్ రెడ్డి మారలేదని, అందుకైనా జీవన్ రెడ్డి మంత్రి కావాలని ఆకాంక్షించారు. హరీష్ రావుపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed