మేము రెడీగా ఉన్నాం.. కిషన్ రెడ్డి కూడా సిద్ధం కావాలి: సుధీర్ రెడ్డి

by Disha Web Desk 2 |
మేము రెడీగా ఉన్నాం.. కిషన్ రెడ్డి కూడా సిద్ధం కావాలి: సుధీర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్ఆర్) లీజుకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే బిడ్డింగ్ జరిగిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిడ్డింగ్‌లో 11 సంస్థలు పాల్గొనగా 4 ప్రముఖ సంస్థలు షార్ట్ లిస్టు అయ్యాయన్నారు. అందులో ఎక్కువ కోట్ చేసిన వారికే లీజు దక్కిందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్టు ఓఆర్ఆర్ బిడ్డింగ్‌పై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని, కిషన్ రెడ్డి కూడా సిద్ధం కావాలని సవాల్ చేశారు. అదానీపై జేపీసీ వేయని వారు సీబీఐకి డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, పూణెలో ఇక్కడ లీజు తీసుకున్న వారే తీసుకున్నారని, బీజేపీ నేతల ఆరోపణల్లో పసలేదన్నారు. రవ్వంత రెడ్డి, తొండి సంజయ్‌లు పిచ్చి విమర్శలు మానుకోవాలని, ప్రజలకు పనికివచ్చే విషయాలపై మాట్లాడాలని హితవు పలికారు. మీడియాలో పతాకశీర్షికల్లో ఉండాలనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. గాంధీ భవన్‌లో గాడ్సేలు చేరారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ చొరవతో హైద్రాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడాన్ని రెండు జాతీయ పార్టీలు ఆయనను టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నాయన్నారు. పెద్దోళ్లను తిడితే పేపర్లలో పతాక శీర్షికల్లో వస్తామని చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పేపర్ లీకేజీ, ఓఆర్ఆర్ వ్యవహారాల్లో ప్రతిపక్షాల తీరు అభాసు పాలయ్యే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌లో ఎలాంటి కొత్త దనం లేదని, ఇప్పటికే విడుదలైన రైతుల డిక్లరేషన్‌ను ప్రజలు మరచిపోయారన్నారు. కర్నాటకలో బీజేపీకి చావు దెబ్బతినబోతోందన్నారు. సిద్ధ రామయ్య లాంటి నేతలను చూసి అక్కడ కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తున్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌కు అలాంటి నేతలు లేరన్నారు. తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ నేతలు పనికి రాని అంశాలపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక తెలంగాణ ఇచ్చామని ఇప్పుడు చెబుతూ ఓట్లు అడుగుతున్నారని, 2014 2018లలో కేసీఆర్‌ను ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్‌ను తిరస్కరించారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్‌కే ప్రజలు పట్టం కడుతారని 100సీట్లతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.

Next Story