షర్మిల విషయంలో రంగంలోకి మరో ఇద్దరిని దింపిన బీఆర్ఎస్!

by Disha Web Desk |
షర్మిల విషయంలో రంగంలోకి మరో ఇద్దరిని దింపిన బీఆర్ఎస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాలుగా మారారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్న ఆమెను బీఆర్ఎస్ ఒక్కసారిగా టార్గెట్‌గా చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. షర్మిల పాదయాత్రపై దాడి నేపథ్యంలో ఆమెకు మద్దతుగా బీజేపీ నేతలు నిలవడం, స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే ఫోన్ లో పరామర్శించారనే ప్రచారంతో షర్మిల విషయంలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. అప్పటి వరకు షర్మిల అంటే పెద్దగా పట్టించుకోని గులాబీ నేతలు షర్మిల విషయంలో ఒక్కసారిగా స్వరం పెంచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు షర్మిలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉంటే షర్మిల విషయంలో తాజాగా బీఆర్ఎస్ మరో ఇద్దరు నేతలను రంగంలోకి దింపడం చర్చగా మారింది.

షర్మిల వైపు ఆ వర్గాలు మళ్లకుండా జాగ్రత్తలు

రాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చానని చెబుతున్న షర్మిలకు తెలంగాణలోని మైనార్టీ వర్గాల్లో కొంత సానుభూతి ఉంది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్ సమాజంలో పలుకుబడి, పరిచయాలు ఉన్నాయి. తనకున్న పరిచయాలతో అనిల్ పోల్ మేనేజ్ మెంట్ చేయగలనే ప్రచారం ఉంది. ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ కావడంతో ఆయన తెలంగాణలోనూ యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. మరో వైపు షర్మిల రాజకీయంగా రోజు రోజుకు దూకుడు పెంచడంతో మైనార్టీ వర్గాలు ఆమె వైపు మళ్లకుండా బీఆర్ఎస్ తాజాగా క్రిస్టియన్ నామినేటెట్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ లను రంగంలోకి దింపింది. తాజాగా వీరిద్దరు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిలపై ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

షర్మిల తెలంగాణలో ఉంటూ మోడీకి ఏజెంట్ గా పని చేస్తూన్నారని, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మైనార్టీకి చెందిన వ్యక్తిగా ఉన్న షర్మిల దేశంలోనే ముస్లింలు, క్రైస్తవులను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్న మోడీకి అపరోక్షంగా మద్దతు తెలపడం బాధేస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్దులు అన్ని వర్గాలు, అన్ని కులాలును గౌరవంగా బతుకుతున్నాయని అన్నారు. అయితే రాష్ట్రంలో అనేక చోట్ల మైనార్టీలపై దాడులు జరుగుతుంటే పెద్దగా రియాక్ట్ కాని వీరిద్దరు తాజాగా షర్మిల విషయంలో రియాక్ట్ అయి మైనార్టీ రాగం అందుకోవడం వెనుక మతలబు ఏంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి. షర్మిల విషయంలో మౌనంగా ఉంటే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ మరింత జాగ్రత్త పడుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మైనార్టీ వర్గాల్లో షర్మిల పట్ల సానుభూతి పెరగకుండా బీఆర్ఎస్ సైతం మైనార్టీ వర్గాలకు చెందిన నేతలతో ఎటాక్ చేయిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ ప్రజల మద్దతు కావాలి కాని షర్మిల వద్దా?

షర్మిల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా మారుతున్నాయి. ఏపీకి చెందిన షర్మిలకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ప్రశ్నిస్తున్నారు. అయితే తాను ఇక్కడే పుట్టానని ఇక్కటే చదువుకున్నానని, తాను తెలంగాణ కోడలిని అంటూ షర్మిల అంతే ధీటుగా బదులు ఇస్తున్నారు. అయితే ఏపీకి చెందిన షర్మిలకు తెలంగాణలో ఏం పని అని కామెంట్స్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు షర్మిల అనుచరులు ఓ అంశాన్ని లేవనెత్తుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో ఆ పార్టీకి ఏపీకి చెందిన ప్రజల మద్దకు కావాలి కాని ఏపీకి చెందిన షర్మిల అడ్డుగా ఉందా అని నిలదీస్తున్నారు.

షర్మిలను విమర్శలు గుప్పించిన ఇదే ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు రెండు నెలల క్రితం ఏపీలో పర్యటించి కేసీఆర్ ప్రారంభించబోతున్న జాతీయ పార్టీకి అక్కడి క్రిస్టియన్ల మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేయించుకువచ్చారు. దీంతో ఏపీలోని క్రిస్టియన్ల మద్దతు అవసరం అయిన బీఆర్ఎస్ కు షర్మిల మాత్రం తెలంగాణలో రాజకీయం చేస్తే తప్పేంటని ఆమె అనుచరులు నిలదీస్తున్నారు. మొత్తంగా ఇన్నాళ్లు షర్మిల విషయంలో నేతల విమర్శలకే పరిమితం అయిన బీఆర్ఎస్ తాజాగా ఆమె మైనార్టీ ఓట్లు చీల్చకుండా కట్టడి చేసే విషయంలో అదే వర్గాలకు చెందిన నేతలను రంగంలోకి దింపడం హాట్ టాపిక్ గా మారింది.


Next Story

Most Viewed