విద్యుత్ బకాయిల చెల్లింపుల్లో రూల్స్ బ్రేక్!

by Disha Web Desk 4 |
విద్యుత్ బకాయిల చెల్లింపుల్లో రూల్స్ బ్రేక్!
X

రూల్ ప్రకారం డ్యూ డేట్‌లోగా వినియోగదారులు కరెంటు బిల్లులు చెల్లించాలి. ఒక నెల బిల్లు కట్టకపోయినా విద్యుత్ ఆఫీసు సిబ్బంది ఇంటికి వచ్చి ఫ్యూజు పీకేస్తారు. లేదా మీటర్ వద్ద వైరు కట్ చేస్తారు. కాస్త లేటుగా కట్టినా ఫైన్ పేరుతో మరింత ఎక్కువగా వసూలు చేస్తారు. ఈ రూల్ కేవలం సామాన్యులకే. ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నిబంధన వర్తించడం లేదు. సర్పంచ్ ఆఫీస్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విద్యుత్ సిబ్బంది మాత్రం సర్కారు ఆఫీసులను లైట్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు సుమారు 14 వేల బిల్లులు పెండింగ్‌లో ఉండగా అందులో దాదాపు 75 శాతం ప్రభుత్వ కార్యాలయాలే ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : సామాన్యులు ఒక్క నెల బిల్లు కట్టకపోతే కరెంట్ ఆఫీసు సిబ్బంది ఇంటికే వచ్చి ఫ్యూజు పీకేస్తారు. ఒక్క రోజు ఆలస్యమైనా పెనాల్టీతో సహా కట్టించుకుంటారు. రూల్స్ ప్రకారమే పని చేస్తున్నామంటూ వారి కఠిన వైఖరిని సమర్ధించుకుంటారు. కానీ సర్కారు ఆఫీసుల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నెలల తరబడి బిల్లు పేరుకుపోతున్నా.. చూసీ చూడనట్టు ఉంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి రూ.50 వేల కంటే ఎక్కువ బిల్లు కట్టకుండా పెండింగ్‌లో ప్రభుత్వ ఆఫీసుల జాబితాను దక్షిణ డిస్కం సిద్ధం చేసింది. దాని పరిధిలో ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి 14,144 మంది యూజర్లు బిల్లులు కట్టలేదు. వీరి బాకీ పడిన బిల్లులు సుమారు రూ.186 కోట్లు. సకాలంలో బిల్లులు కట్టకుండా ఎగ్గొతున్నవారిలో సర్పంచ్ మొదలు కలెక్టర్ వరకు ఉన్నారు. కలెక్టరేట్, దానికి అనుబంధంగా ఉన్న ఆఫీసుల కరెంటు బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్నాయి. కలెక్టరు బంగళా కూడా టైమ్‌కు బిల్లు కట్టలేదు.

75 శాతం ప్రభుత్వ ఆఫీసులే..

ఎగవేతదారుల్లో దాదాపు 75% సర్కారు ఆఫీసులే ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆఫీసులు, వాటర్ గ్రిడ్, ఇరిగేషన్ విభాగాలు, ఇంజినీర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీసులు.. ఇలా అనేక సర్కారు విభాగాలు కరెంటు బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించడంలేదు. ఆయా ఆఫీసుల కస్టమర్ ఐడీలు, సర్వీసు కనెక్షన్ నంబర్ల వారీగా బకాయిల జాబితాను సెప్టెంబరు 30 డెడ్‌లైన్‌తో దక్షిణ డిస్కం రూపొందించింది. సర్కారు నుంచి ఆయా శాఖలకు నిధులు విడుదలవుతున్నాయి. ఆయా ఆఫీసుల సిబ్బంది ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేస్తున్నాయి. కానీ కరెంటు బిల్లులను మాత్రం సకాలంలో చెల్లించడంలో ఆ ఆఫీసుల హెచ్ఓడీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంటు సిబ్బంది సైతం ప్రభుత్వ ఆఫీసులను చూసీచూడనట్టు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. చివరకు డిస్కంలు నష్టాల్లో కూరుకుపోతున్నాయంటూ సీఎండీలు వాపోతున్నారు. సామాన్యుల నుంచి డిమాండ్ చార్జీలు, లోడ్ చార్జీలు, ట్రూ అప్ చార్జీల రూపంలో ఎప్పటికప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్న సిబ్బంది.. క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నా ప్రభుత్వ ఆఫీసుల విషయంలో మాత్రం భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

రూ.లక్షల్లో పెండింగ్..

వనపర్తి జిల్లా పరిషత్ సీఈఓ ఆఫీసు రూ.47.77 లక్షలు, నల్లగొండ జెడ్పీ సీఈఓ ఆఫీస్ రూ.37.81 లక్షలు, దీనికి అనుబంధంగా ఉన్న మరో ఆఫీసు రూ.36.52 లక్షలు, రూరల్ వాటర్ సప్లయ్ ఆఫీసు (సర్వీస్ కనెక్షన్ నెంబర్ ఆర్ 19000620) రూ.28.36 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక నల్లగొండ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ (మిషన్ భగీరథ) ఆఫీసు రూ.25.68 లక్షలు, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆఫీసు రూ.25.40 లక్షలు, శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్ ఆఫీసు రూ.23.94 లక్షలు, సైబర్‌సిటీ పరిధిలోని భగీరథ వాటర్ గ్రిడ్ ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఆఫీసు రూ.21.91 లక్షలు బాకీ పడ్డాయి. బంజారాహిల్స్ స్పెషల్ ఆఫీసర్ (సర్వీస్ నెం. ఏ-9014225) రూ.20.21 లక్షలు, జీహెచ్ఎంసీ 13వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ రూ.18.20 లక్షలు, సంగారెడ్డి జిల్లా గ్రామ పంచాయతీ వాటర్ వర్క్ ఆఫీస్ (నెం. 080600162) రూ. 17.82 లక్షలు.. ఇలా వేలాది ప్రభుత్వ ఆఫీసులు బిల్లులు కట్టకుండా కోట్ల రూపాయలు పెండింగ్‌లోనే ఉంచాయి. బాకీ పడిన 14 వేల యూజర్లలో సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ ఆఫీసులు, వాటికి అనుబంధంగా రూరల్ వాటర్ సప్లయ్ లాంటివి సుమారు 2,750 ఉన్నాయి. ఇక కలెక్టరేట్‌లు, వాటికి అనుబంధంగా ఉన్న ఆఫీసులు, కలెక్టర్ బంగళాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు సైతం బిల్లులు ఎగ్గొట్టాయి. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ రూ.7.30 లక్షలు, సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ రూ.2.58 లక్షలు, నల్లగొండ (తాళ్ళవెల్లంల) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రూ.2.22 లక్షలు, చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రూ.1.03 లక్షలు బకాయి పడ్డాయి.

నష్టాల భర్తీకి చార్జీల పెంపు

విద్యుత్ డిస్కంలు (ఉత్తర, దక్షిణ డిస్కంలు) నష్టాలను చూపిస్తూ వాటిని భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కరెంటు చార్జీలను పెంచాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిన ఏఆర్ఆర్‌లో సైతం రానున్నరేండ్లలో వచ్చే నష్టాలు, చార్జీలు పెంచడం ద్వారా సమకూరే అదనపు ఆదాయం, వాటిని సర్దుబాటు చేసుకోవడం తదితరాలపై వివరాలను పేర్కొన్నాయి. ఆ ప్రకారమే ఇప్పుడు కొత్తచార్జీలు అమలవుతున్నాయి. సబ్సిడీ రేట్లతో సెలూన్లు, దోబీ ఘాట్‌లు, తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు తదితరాలకు ప్రభుత్సం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేయడం లేదని డిస్కంలు మొత్తుకుంటున్నాయి. ఇక వ్యవసాయ రంగానికి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌కు వాడిన కరెంటు బిల్లులు కూడా ఇన్‌టైమ్‌లో కట్టడం లేదని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులు వెంటాడుతుండగా వాటికి అదనంగా సర్కారు ఆఫీసుల బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. కొన్ని ప్రైవేటు సంస్థలు కోర్టు కేసుల కారణంగా దీర్ఘకాలంగా కరెంటు బిల్లుల బకాయిలను చెల్లించడంలేదు. ఇలాంటి మొండి బకాయిలన్నింటినీ సకాలంలో వసూలు చేయగలిగితే నష్టాలను భర్తీ చేసుకోవచ్చని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నాయకులు పలు సందర్భాల్లో ఓపెన్‌గానే చెప్పారు. తాజాగా సెప్టెంబరు 30 వరకు వివిధ సర్కారు ఆఫీసుల నుంచి బకాయిలుగా ఉండిపోయిన రూ.186 కోట్లను దక్షిణ డిస్కం ఎప్పటికి వసూలు చేస్తుందన్నదే ప్రశ్నగా మారింది.

Next Story

Most Viewed