ఎన్నికలకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయనున్న బీజేపీ.. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ షురూ

by Disha Web Desk 4 |
ఎన్నికలకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయనున్న బీజేపీ.. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ షురూ
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఘట్ కేసర్ వీబీఐటీ కళాశాలలో స్టేట్ కౌన్సిల్ మీటింగును నిర్వహిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ఈ సమావేశాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మొదలైన ఈ మీటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఎన్నికల ముందు జరుగుతున్న రాష్ట్ర స్థాయి బీజేపీ కౌన్సిల్ సమావేశం కావడంతో పలు కీలక అంశాలపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ప్రతిపాదించిన తీర్మానాలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రకటించిన పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణ జలాల ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాద తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఈ తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే.. తెలంగాణ కోసం ఏం చేస్తామనే దానిపై రాజకీయ తీర్మానం పెట్టాలని నిర్ణయించారు.

అంతేకాకుండా పార్టీ నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చించనున్నారు. కౌన్సిల్ సమావేశానికి దాదాపు వెయ్యి మంది ముఖ్య నేతలు హాజరుకానున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇన్ చార్జీలు, జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీలు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత ఘట్ కేసర్ లో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ప్రకాష్ జవదేకర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు.

రాజగోపాల్, విజయశాంతి డుమ్మా

ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి స్టేట్ కౌన్సిల్ మీటింగ్ కు గైర్హాజరయ్యారు. కొద్దిరోజులుగా వీరు ప్రియారిటీ దక్కడంలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. కాగా ఇటీవల బీజేపీ విడుదల చేసిన ఎన్నికల కమిటీల్లో ఇరువురికి అవకాశం కల్పించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా, విజయశాంతికి అజిటేషన్స్ కమిటీ చైర్మన్‌గా నియమించింది.

ఇప్పటికే ప్రధాని మోడీ రెండు సభలకు తోడు పదాధికారుల మీటింగుకు కూడా డుమ్మా కొట్టిన వీరు తాజాగా స్టేట్ కౌన్సిల్ మీటింగుకు సైతం గైర్హాజరయ్యారు. కాగా తాను పార్టీ వీడటం లేదని అటు రాజగోపాల్ రెడ్డి, ఇటు విజయశాంతి ఇరువురు పలుమార్లు మీడియాకు క్లారిటీ ఇచ్చుకున్నా వారు పార్టీ మారుతారనే ప్రచారమే జరగుతోంది. వీరు డుమ్మా ఎందుకు కొడుతున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అందరూ అనుకన్నట్లే వీరు పార్టీ మారుతారా? లేక ఇందులోనే కొనసాగుతారా? అనేది చూడాలి.



Next Story

Most Viewed