BJP: జితేందర్ రెడ్డి.. ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలె : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

by Disha Web Desk 1 |
BJP: జితేందర్ రెడ్డి.. ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలె : మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఉదయం ఓ పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రం కల్లా మరో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఈ తరుణంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయని, సమీకరణల మేరకు నేతలు కూడా పార్టీలు మారుతున్నారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ నుంచి వెళ్లిన ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారని, అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి సీటిస్తే తమ పార్టీకి సిద్ధాంతం ఉంటుందని, సీటు ఇవ్వకపోతే ఉండదా అని ప్రశ్నించారు.

త్వరలోనే జితేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ ‌రెడ్డి బాగోతాలను ఒక్కొక్కటిగా బయట పెడతామని హెచ్చరించారు. తమ ప్రాంత ప్రజా శ్రేయస్సు కొరకు వారిద్దరూ పార్టీలు మారామని చెప్పడం నూరు శాతం అబద్ధమని, కేవలం ఆర్థికంగా లాభ పడేందుకు మాత్రమే పార్టీ మారారని ఆరోపించారు. అదేవిధంగా జితేందర్ రెడ్డి రెండు కంపెనీలు, అక్రమ నిర్మాణాలపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో అక్రమ నిర్మాణాలపై త్వరలో న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. ఇదే విషయంపై ఐటీ, ఈడీ అధికారులను కూడా సంప్రదిస్తామని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తనను ఎవరూ కొనలేరని చెప్పిన జితేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని రఘునందర్ డిమాండ్ చేశారు.



Next Story