ఖైరతాబాద్‌లో పాగా కోసం బీజేపీ స్కెచ్

by Disha Web Desk 4 |
ఖైరతాబాద్‌లో పాగా కోసం బీజేపీ స్కెచ్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నియోజకవర్గాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై విజయం సాధించారు.

అయితే 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తిరిగి దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిని ఓడించి మళ్ళీ గెలుపును సొంతం చేసుకున్నారు. గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి మెరుగైందనే చర్చలు నియోజకవర్గంలో జోరుగా నడుస్తుండగా ఈ యేడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో తిరిగి ఖైరతాబాద్ స్థానాన్ని మరోమారు కైవసం చేసుకునేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుండి పోటీ చేసేందుకు పలువురు బీజేపీ నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారు .

ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట..

గ్రేటర్ పరిధిలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కొంత భిన్నమైన వాతావరణం కనబడుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2014 లో ఊహించని షాక్ తగిలింది. బీజేపీ నుండి పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై గెలుపొందారు. అనంతరం దానం నాగేందర్ టీఆర్ఎస్‌లో చేరగా 2018 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి చింతలను

ఓడించి గెలుపును సొంతం చేసుకున్నారు. అయితే అధికార పార్టీ నుండి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీజేపీ చాపకింద నీరులా ప్రచారం చేస్తోంది. ఖైరతాబాద్‌లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఎలాగైనా టిక్కెట్ దక్కించుకోగలిగితే విజయం సాధిస్తామనే ధీమాలో బీజేపీ నాయకులు ఉన్నారు.

చింతల వర్సెస్ పల్లపు...

ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. రాబోయే ఎన్నికలలో ఇక్కడ బీజేపీ తప్పక విజయం సాధిస్తుందనే ధీమాతో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మరో నాయకుడు పల్లపు గోవర్థన్ ఇక్కడి నుండి పోటీ చేసే వారిలో ప్రముఖంగా ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మాజీ హై కోర్టు

న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి తనయుడు ఇంద్రసేనా రెడ్డి కూడా ఖైరతాబాద్ టిక్కెట్‌ను ఆశిస్తున్నారని తెలిసింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ముగ్గురిలో ఎవరి వైపు మొగ్గుచూపుతుందో అనేది పార్టీ వర్గాలలో చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed