పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ వ్యాట్ తగ్గించాలి: MP Arvind

by Disha Web Desk 2 |
పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ వ్యాట్ తగ్గించాలి: MP Arvind
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయంగా చమురు ధరలు ఏప్రిల్ 6వ తేదీన నుంచి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ భారత దేశంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెంటింగ్ కంపెనీలు ధరలు పెంచలేదని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. గురువారం లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ భారతదేశం దాని ముడి చమురు అవసరాలలో 85% కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాట్ తగ్గించకపోవడం వల్లే ప్రజలపై భారం పడుతోందని అన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనంపై వ్యాట్‌ను తగ్గిస్తే ఈ రాష్ట్రాల్లోని వినియోగదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై ఉపశమనం కలుగుతుందని చెప్పారు.

కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ వ్యాట్‌ను విధిస్తూనే ఉన్నందున ప్రజలు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని అన్నారు. ఇంధన ధరల విషయంలో గతంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఇవే రాష్ట్రాల పేర్లను ఉటంకించడం అప్పట్లో చర్చగా మారింది. కేంద్రం ప్రస్తావిస్తున్న ఈ రాష్ట్రాలు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కావడంతో రాజకీయంగా చర్చనీయాశం అవుతోంది. తాజాగా కేంద్ర మంత్రి లోక్ సభలో మరోసారి ఈ ఆరు రాష్ట్రాలను ప్రస్తావిస్తూ వ్యాట్ తగ్గిస్తే ఇంధన ధరల భారం నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని పేర్కొన్నారు. అయితే వ్యాట్ తగ్గించే విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యాట్ పెంచలేదని తాము పెంచని వ్యాట్‌ను ఎలా తగ్గిస్తామని ప్రశ్నిస్తూవస్తున్నారు. కేంద్రమే ధరలు పెంచి ఇప్పుడు వ్యాట్ రూపంలో తగ్గించుకోవాలని చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లోక్ సభలో మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.



Next Story