ధరణి పోర్టల్‌ను సవరించేదాకా ఉద్యమం ఆగదు: BJP కిసాన్ మోర్చా

by Satheesh |   ( Updated:2023-02-08 12:43:31.0  )
ధరణి పోర్టల్‌ను సవరించేదాకా ఉద్యమం ఆగదు: BJP కిసాన్ మోర్చా
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ పరిసరాలు అట్టుడికిపోయాయి. ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దశలవారీగా నేతలు అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారు. ధరణి పోర్టల్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపునకు కిసాన్ మోర్చా నేతలు ఒక్కసారిగా దూసుకురావడంతో వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పోలీసులు, కిసాన్ మోర్చా నేతలకు మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీలోకి వెళ్లకుండా కిసాన్ మోర్చా నేతలను పోలీసులు ఈడ్చేశారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు లక్షలోపు రుణాలను మాఫీ చేయాలని నినాదాలు చేశారు. అదేవిధంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ వల్ల బాధలు పడుతున్న రైతుల భూములను కాజేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని కిసాన్ మోర్చా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణి పోర్టల్‌లోని లోపాలవల్ల లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌ను సవరించేదాకా ఉద్యమం కొనసాగుతుందని కిసాన్ మోర్చా నేతలు హెచ్చరించారు. ముట్టడికి తరలివచ్చిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కిరణ్ సహా పలువురు రాష్ట్ర నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Advertisement

Next Story