వారం రోజులు.. 119 సభలు.. బీజేపీ భారీ ప్లాన్

by Disha Web Desk 12 |
వారం రోజులు.. 119 సభలు.. బీజేపీ భారీ ప్లాన్
X

పార్టీని బలోపేతం చేసేలా.. కార్యకర్తల్లో జోష్ నింపేలా కమలం పార్టీ ప్లాన్ చేస్తున్నది. వారం రోజుల్లో తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంచిర్యాల నియోజకవర్గంలో నిర్వహించిన సభతో దీన్ని స్టార్ట్ చేశారు. పార్టీలోని ముఖ్య నేతలందరినీ ఈ సభల్లో భాగస్వాముల్ని చేయనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వారం రోజుల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కట్టడి చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రతి రోజు ఆయా సెగ్మెంట్లలో రాష్ట్ర స్థాయి నేతలు పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 30వ తేదీ వరకు ఫుల్ బిజీగా ఉండనున్నారు. రోజుకో అసెంబ్లీలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈనెల 24న రామగుండం, 25న నాగర్ కర్నూల్ లో జేపీ నడ్డా ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభతో పాటు 26వ తేదీన నల్లగొండ, 27న మలక్ పేట, 28న ఇబ్రహీంపట్నం, 29న మక్తల్, 30వ తేదీన బోథ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్, ఇతర నేతలు ఒక్కొక్కరూ కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు.

నేడు ఇంటింటికీ బీజేపీ

ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మహాజన్ సంపర్క్ యోజన పేరిట బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నది. మే 30 నుంచి జూన్ 30వ వరకు కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా గురువారం ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమం ద్వారా ఒక్కరోజే తెలంగాణలోని 35 లక్షల కుటుంబాలను కలిసేలా కాషాయ పార్టీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసుకున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 57వ డివిజన్ 173 పోలింగ్ బూత్ పరిధిలో మోడీ పథకాలను వివరించనున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్ పేట, పాంపల్లి, జూబ్లీహిల్స్ సెగ్మెంట్లలో, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల పరిధిలోని హిమాయత్ నగర్, ఎంపీ లక్ష్మణ్ గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానంద నగర్ బస్తీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 23వ తేదీన శ్యామ ప్రసాద్ ముఖర్జీ దివస్ సందర్భంగా 10 లక్షల బూత్‌లలోని కార్యకర్తలతో ప్రధాని మోడీ వర్చువల్ గా సమావేశం కానున్నారు. తెలంగాణ బీజేపీ లక్ష్యాలు ఘనంగా ఉన్నా, ఆచరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా నిర్వహిస్తున్న ఈ సభలు పార్టీకి ఎంత మేరకు మైలేజ్ ఇస్తాయనేది వేచి చూడాల్సిందే



Next Story

Most Viewed