అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్‌పై బెట్టింగ్..?

by Disha Web Desk 4 |
అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్‌పై బెట్టింగ్..?
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పొంగులేటి టీం అభ్యర్థి జారె ఆదినారాయణలలో బీఫాం ఎవరిని వరించనుందా అనే ఉత్కంఠత నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఈ ఇద్దరికీ దాదాపు టికెట్ ఖరారు అయిందని వారి వర్గీయులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ అంశంపై పందెం రాయుళ్లు కూడా ఫోకస్ చేశారని టాక్..!

ఈ ఇద్దరిపైనే పందేలు

అశ్వారావుపేట అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో టీపీసీసీ మెంబర్ సున్నం నాగమణి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన రాజకీయ వారసురాలు వగ్గెల పూజిత, పొంగులేటి టీం అభ్యర్థి జారె ఆదినారాయణల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాటి వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ముందు తాటి ఆ తర్వాత జారే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరి వెంట కొందరు అనుచర వర్గం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వీరందరికీ తమ నాయకుడికే టికెట్ వచ్చి తీరాలనే తప్పని పరిస్థితి ఉంది.

దీంతో ఇద్దరిలో ఎవరికి టికెట్ వస్తుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే విషయంపై బెట్టింగ్ కట్టేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు లక్షల్లో పందెం కాసి ఉన్నారని తెలుస్తుంది. మరికొందరేమో పందెం ఉంటే చెప్పాలని అడుగుతున్నారంట..! అయితే ఈ ఇద్దరిలోనే ఒకరికి టికెట్ కేటాయిస్తే ఓ వర్గం పందెం పంతం గెలిచినట్టే.. లేదా ఈ ఇద్దరికీ మొండిచెయ్యి చూపి మరొకరికి హస్తం అందిస్తే పందెం టై అయినట్టే.. ఏదేమైనా పందెం రాయుళ్ల అదృష్టం పరీక్షించుకోవడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

టికెట్ ఖరారని ప్రచారం

అశ్వారావుపేట కాంగ్రెస్ టికెట్ తమ వారికే కేటాయించారని వారి వర్గీయులు రోజుకో కథనాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారినప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం.. అందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే అశ్వారావుపేటకు చెందిన ఓ యువ నేత ప్రోద్బలంతో టికెట్ కేటాయించేసారంటున్నారు. సున్నం నాగమణికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆశీస్సులతో టికెట్టు వరించిందంటున్నారు.

జారె ఆదినారాయణకు మాజీ ఎంపీ పొంగులేటి అండతో టికెట్ వచ్చేసిందని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యమంటున్నారు. ఇక వగ్గెల పూజితకు మాజీ టీ పీసీసీ చీఫ్ సిఫార్సు చేయడం.. మాజీ మంత్రి తుమ్మల టికెట్ కోసం ఈమె పేరు ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల తాటి వెంకటేశ్వర్లు కూడా మద్దతిచ్చారని మరో ప్రచారం కూడా ఉంది. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు ఊహాగానాలకు వాస్తవికతను జోడించి సరికొత్త ప్రచారాలకు తెరలేపారు. మరి టికెట్ ఎవరికి ఫైనల్ కానుందో తేలాల్సి ఉంది.

Next Story

Most Viewed