పాలకులు బీసీలకు బిక్షగాళ్లను చేశారు: ఆర్ కృష్ణయ్య

by Mahesh |
పాలకులు బీసీలకు బిక్షగాళ్లను చేశారు: ఆర్ కృష్ణయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నో ఏండ్లుగా దేశ పాలకులు బీసీలను బిక్షగాళ్లను చేశారని, బీసీఓట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నష్టం చేస్తే ఊరుకునేది లేదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం జరిగిన మహా ధర్నాను బీసీ జనసభ అద్యక్షుడు రాజారామ్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర, హక్కుల కోసం రక్తం చిమ్మిన తెలంగాణ నేలపై బీసీలకు అన్యాయం చేస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

బీసీ జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ప్రాతినిధ్యం, అన్ని రంగాల్లో వాటా కోసం బీసీ లు మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కుల కోసం, న్యాయమైన వాటా కోసం బీసీ మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో సమగ్ర కులగణన అంటూ, గవర్నర్ తో బీసీ కులగణన అని అసెంబ్లీలో మాట్లాడించడం ఎలా సరైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీ లకు వ్యతిరేకంగానే జరిగిందన్నారు.

కాకా కలేల్కర్ కమీషన్ నుండి మండల్ కమీషన్ వరకు బీసీ లకు వ్యతిరేకంగా పని చేసిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందన్నారు. బీసీ లకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని, బీసీ శక్తిని రాజకీయ శక్తిగా మార్చి వాటా సాధిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణకుమార్, బత్తుల సిద్ధేశ్వర్లు, పుటం పురుషోత్తం, గౌరీ శంకర్, ముఠా జయసింహ, కొల్లూరు సత్యనారాయణ, చాపర్తి కుమార్ గాడ్గే, వళ్లాల జగన్ గౌడ్, పొన్నం మహేష్ గౌడ్, గుండ్రాతి శారద గౌడ్, దేశం మహేష్ గౌడ్, జై హింద్ గౌడ్, అశోక్ పోచం, నాగేందర్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.Next Story

Most Viewed