Bandi Sanjay Kumar : అసదుద్దీన్‌కు బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 4 |
Bandi Sanjay Kumar  : అసదుద్దీన్‌కు బండిసంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, కరీంనగర్: అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. దారుస్సలాంలో కూర్చొని బీరాలు పలకడం కాదని.. మీకు దమ్ముంటే, తెలంగాణ అంతటా పోటీ చేయాలని ఎంఐఎం చీఫ్ కు సవాలు విసిరారు. బీఆర్ఎస్‌ను సంకలేసుకుని వస్తారో.. కాంగ్రెస్ సహా గుంట నక్కల పార్టీలతో కలిసి పోటీ చేస్తారో చూద్దామన్నారు. బీజేపీ సింహంలా సింగిల్‌గానే పోటీ చేస్తుందన్నారు. మీకు డిపాజిట్లు రాకుండా చేస్తాం అని బండి సవాల్ విసిరారు.

సొంతంగా బలపడకుండా ఇంకో పార్టీ బలపడాలని కోరుకునే ఎంఐఎం నాయకులు అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగుతూ సొంత ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ముస్లిం సమాజమే ఎంఐఎం పార్టీని చీత్కరిస్తోందన్నారు. కరీంనగర్‌లోని పద్మానగర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి సంబంధించి ఈరోజు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాగుపాము, ఎంఐఎం ఉన్నన్ని రోజులు బీజేపీని అధికారంలోకి రానీవ్వబోమంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బండి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చేతగాని పార్టీ అన్నారు. ఆ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అర్ధమవుతోందన్నారు. ఎంఐఎంకు అధికారంలోకి రావాలనే ఆలోచన లేదు.. అధికారంలో ఎవరుంటే వాళ్లతో అంటకాగే పార్టీ ఎంఐఎం అన్నారు.

ముస్లింల బాగోగుల గురించి ఏనాడూ పట్టించుకోని పార్టీ మజ్లిస్ అన్నారు. నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదన్నారు? ముస్లింలకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కనీసం ముస్లింలకు పాస్ పోర్ట్ కూడా ఎందుకు రావడం లేదని దీనిపై ఎంఐఎం నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒవైసీ ఎంతసేపు ఆస్తులను కాపాడుకోవడానికే తపిస్తున్నారని మండిపడ్డారు. 15 నిమిషాలు టైమ్ ఇస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. ఎంఐఎం ఏనాడైనా సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావాలని కోరుకుందా అన్నారు. మీరు నిజంగా ముస్లిం సమాజం కోసమే పనిచేస్తున్నారని భావిస్తే...తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేయాలన్నారు.

శంషాబాద్‌లోని ఓ వ్యాపారి అమిత్ షాకు ఇల్లు కట్టించారని, అమిత్ షా ఇకపై ఇక్కడే ఉంటారని ఎంఐఎం చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన బండి సంజయ్ ‘‘ ఆ విషయం ఆయనకే తెలియాలన్నారు. బహుశా ఆయనకు టెర్రరిస్టు సంస్థ ఏమైనా ఈ విషయం చెప్పిందేమో..అన్నారు. ఆ ఇంటికి వస్తే పేల్చాలని చూస్తున్నరేమో... అన్నారు. మా పార్టీ అగ్రనేత సమాచారం మాకు తెలియకుండానే ఆయనకే తెలుస్తుందా?’’అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రపై మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘బస్ యాత్ర, పాదయాత్రపై పార్టీలో అందరం కూర్చుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తమది ఏక్ నిరంజన్ పార్టీ కాదన్నారు.

Next Story

Most Viewed