Bandi Sanja: ఇకనైనా ఆ పని ఆపండి: బీజేపీ అసంతృప్త నేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
Bandi Sanja: ఇకనైనా ఆ పని ఆపండి: బీజేపీ అసంతృప్త నేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని నేతలకు హితువు పలికారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా బీజేపీ పార్టీ ఆఫీస్‌లో మాట్లాడారు.

తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నాయకుడు, కార్యకర్తలు తనకు సహకరించారని చెప్పారు. చాలా కష్టపడి పనిచేశాననే తృప్తి నాకుంది.. అది చాలు అని వెల్లడించారు. తెలంగాణలో నయా నిజాం పాలనను అంతమొందించాలని, బీజేపీ కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని, నాన్ బెయిలబుల్ కేసులు వారిపై ఉన్నాయన్నారు. వారు నిజమైన హీరోలని, పాతబస్తీలోని కార్యకర్తలు హీరోలు అని ఆవేదన వ్యక్తంచేశారు.

హైదరాబాద్ భాగ్యలక్షి ఆలయం దగ్గర మీటింగ్ పెట్టిన దమ్ము ఎవరికుంది.. కాంగ్రెస్‌కు లేదు, బీఆర్ఎస్‌కు లేదన్నారు. ఈ రెండు పార్టీలు నమాజ్ చేసి సభలు పెడుతాయని విమర్శించారు. కానీ బీజేపీ భాగ్యలక్ష్మి అమ్మవారికి మొక్కి సభ పెట్టినట్లు చెప్పారు. అది చార్మినార్ కాదు.. భాగ్యలక్ష్మి అమ్మవారు కొలువైన భాగ్యనగరమన్నారు. పాత బస్తీ మీది కాదురా.. మాదేరా.. ఏ బస్తీ అయినా మాదేరా అని అన్నారు.

మూర్ఖత్వ, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాటసింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారని తెలిపారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరని అన్నారు.

కిషన్ రెడ్డి అధ్యక్షత బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడని అన్నారు. కేసీఆర్ దరిద్రం మొఖాన్ని ఫస్ట్ పేజీలో చూపించాలనుకుంటున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ అని, అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. జీవిస్తున్నాడన్నారు. ఇవ్వాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్‌తో ప్రచారం చేయిస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలని మండిపడ్డారు.

Read more : disha newspaper




Next Story

Most Viewed