‘‘పీలో తెలంగాణ.. పిలావో తెలంగాణ’’.. ఇదే KCR నినాదం: బండి సంజయ్ సెటైర్

by Disha Web Desk 19 |
‘‘పీలో తెలంగాణ.. పిలావో తెలంగాణ’’.. ఇదే KCR నినాదం: బండి సంజయ్ సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీది ‘ఖేలో ఇండియా-జీతో ఇండియా’ నినాదమైతే, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పీలో తెలంగాణ.. పిలావో తెలంగాణ’ నినాదంతో పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాదర్ ఘాట్‌లో మంగళవారం నిర్వహించిన ‘ఖేలో భారత్–జీతో భాగ్యనగర్’ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన మాట్లాడారు.

ఖేలో ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఎంపీలున్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ అనాథగా మారొద్దనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. యూపీఏ హయాంలో క్రీడా రంగానికి రూ.466 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. ఇప్పుడు ప్రధాని మోడీ రూ.3,397 కోట్లు కేటాయించారన్నారు.

తెలంగాణలో పొద్దున లేస్తే బాటిల్ ముందు పెట్టుకుని తాగడం తాగించడమే పనిగా కేసీఆర్ పెట్టుకున్నారని సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. మద్యం మత్తులో కేసీఆర్ 5 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగమిస్తానని చెప్పి మాట తప్పి నిరుద్యోగ యువకులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో యువత ఆశలను చిదిమేశారని, రుణమాఫీ చేస్తానని, ఉచితంగా ఎరువులిస్తానని రైతులను మోసం చేశారన్నారు.

దళిత బంధు, దళితులకు మూడెకరాల పొలం పేరుతో దళితులను, పోడు పట్టాల పేరుతో గిరిజనులను మోసం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ మోసాలకు అంతేలేదని వ్యాఖ్యానించారు. యువత కేసీఆర్ మోసాలను గ్రహించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే క్రీడలకు అత్యధిక ప్రోత్సహిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఓబీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్ రాజ్ అహిర్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్ నాయక్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed