టీ బీజేపీలో చేరికల రగడ.. ఆ మాజీ నేతల చేరికపై బండి, కిషన్ రెడ్డి అసంతృప్తి!

by Disha Web Desk 13 |
టీ బీజేపీలో చేరికల రగడ.. ఆ మాజీ నేతల చేరికపై బండి, కిషన్ రెడ్డి అసంతృప్తి!
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల వేళ టీ బీజేపీలో చేరికల జోష్ నెలకొంది. పలువురు సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్ ను వీడి కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. అలా చేరిన వారిలో కొందరికి వెంటనే ఎంపీ టికెట్ సైతం దక్కుతుండటంతో చేరికల వ్యవహారం ఇటు సొంత పార్టీలో అటు ప్రత్యర్థుల్లో చర్చగా మారింది. ఇంతలో నిన్న బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ సీతారాంనాయక్, నగేశ్ లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే వీరి చేరిక ఇప్పుడు కమలం పార్టీలో కాక రేపుతున్నది. సైదిరెడ్డి, నగేశ్ ల చేరికను పార్టీలోని కీలక నేతలు వ్యతిరేకిస్తుండటంతో చేరికల ఉత్సాహం కాస్త దుమారంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

సైదిరెడ్డిని వ్యతిరేకిస్తున్న బండి, కిషన్ రెడ్డి!

బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జోరుగా వలసలు జరుగుతున్న తరుణంలో వారిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు చేయించి, కేసులు పెట్టించిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటారని సైదిరెడ్డి, నగేశ్ ల చేరికపై పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి చేరికను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ లు అపోజ్ చేస్తున్నారని సైదిరెడ్డిచేరిక ఇష్టం లేకే నిన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీలోని అగ్రనేతలే వ్యతిరేకిస్తున్నారనే సమాచారం బీజేపీలో చేరికల చిచ్చు హాట్ టాపిక్ అవుతున్నది.

అధిష్టానం ఇచ్చే సమాధానం ఆధారంగానే నెక్స్ట్ స్టెప్:

మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ నగేశ్ చేరికను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన చేరికను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ కు చెందిన రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపులు ఢిల్లీకి వెళ్లి అక్కడ పార్టీ పెద్దలతో భేటీ కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీఎల్ సంతోష్ తో సమావేశమై తమ మనసులోని మాటను వారితో చెప్పనున్నారట. అక్కడ బీఎల్ సంతోష్ ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి కార్యచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీలో చేరిన నగేశ్ కే ఆదిలాబాద్ టికెట్ కేటాయించబోతున్నారనే ప్రచారంతో నగేశ్ కు టికెట్ విషయంలో పలువుర నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటిల్, పాల్వయి హరీశ్ వంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మొత్తంగా చేరిలక బీజేపీ చేరికల వేళ అసంతృప్త జ్వాలలను పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారనేది సస్పెన్స్ ను క్రియేట్ చేస్తోంది.


Next Story

Most Viewed