కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేస్తాం

by Disha Web Desk 4 |
కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలు బుద్ది లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్న తీరును ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ధాన్యం సేకరణపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే.. బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష గట్టి రైతాంగం పొట్టగొడుతోందని చెప్పారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించాల్సింది పోయి వెనకేసుకు వస్తుండటం శోచనీయమని విమర్శించారు. బండి సంజయ్ పీయూష్ గోయల్ వ్యాఖ్యల వీడియో అడగడం హాస్యాస్పదమని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పీయూష్ గోయల్ దెబ్బ తీశారన్నారు. కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఇప్పటికే పంచాయతీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపుతున్నామన్నారు.

'బండి సంజయ్ కేంద్రంతో ధాన్యం కొనిపిస్తామని హామీ ఇచ్చిన వీడియోలు బయట పెడుతున్నా.. సంజయ్ సమాధానమివ్వాలి. రైతులను యాసంగిలో వరి వేయాలని బీజేపీ రెచ్చ గొట్టింది. ఇప్పుడు మాత్రం ధాన్యం కొనాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని బీజేపీ నేతలు మాట మారుస్తున్నారు. ఎక్కడా లేని సమస్య రాష్ట్రం లోనే ఎందుకొస్తుందని బీజేపీ నేతలు పదే పదే అంటున్నారు. తెలంగాణలో రైతుల కోసం కేసీఆర్ చేపట్టిన చర్యలతో అన్నపూర్ణ తెలంగాణగా అవతరించింది. బీజేపీ దద్దమ్మలు ఈ విషయాన్ని గమనించాలి. ధాన్యం ఉత్పత్తి ఎందుకు పెరిగిందో బీజేపీ నేతలు చెప్పాలి. ధాన్యం ఉత్పత్తి తెలంగాణ లో 400 రెట్లు పెరిగింది .ఇది కేసీఆర్ రైతు అనుకూల విధానాల వల్ల కాదా? కేంద్ర ప్రభుత్వ పరిధి లోనే ఆహార భద్రత అనే అంశం ఉంటుంది అన్న సోయి బీజేపీ కి లేదా?' అని బాల్క సుమన్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed