కార్పొరేట్లకు బల్దియా ఆస్తులు?

by Disha Web Desk 4 |
కార్పొరేట్లకు బల్దియా ఆస్తులు?
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి కార్పొరేషన్‌ను గట్టెక్కించేందుకు అధికారులు సరికొత్త ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోగా, సొంత ఆర్థిక వనరులతో నిధులను సమకూర్చుకుంటే వాటిని మౌలిక వసతులు, పౌరసేవల నిర్వహణకు గాక, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పనులకు వెచ్చించడం, రూ.5500 కోట్ల పైచిలుకు అప్పులు పెరిగిపోవటంతో బల్దియా ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఇక బల్దియాకు మిగిలినది ఆస్తులొక్కటే.

ఇప్పటికే లీజుకిచ్చిన ఆస్తులకు సంబంధించిన లీజు గడువు ముగిసిన వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయంపై కసరత్తు కొనసాగుతుండగా, లీజుకు సబ్ లీజుగా ఏర్పడి, లీగల్ కేసులున్న ఆస్తులపై లీగల్ గానే ముందుకెళ్లి, త్వరగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కనిష్టంగా రెండు ఎకరాల స్థలంలో ఉన్న ఆస్తులు, గరిష్టంగా ఐదు ఎకరాల స్థలంలో ఉన్న ఆస్తులను లీజుకిస్తే కొంత మేరకైనా ఆదాయం సమకూరుతుందనే దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

తొలి దశగా సికింద్రాబాద్ హరిహర కళాభవన్, బుద్దభవన్, అబిడ్స్ మున్సిపల్ కాంప్లెక్స్ వంటివి కార్పొరేట్ సంస్థలకు లీజుగా ఇస్తే వీటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశాలుంటాయని, దశాబ్దాలుగా నామమాత్రపు అద్దెలు, లీజు ఛార్జీలతో సరిపెట్టుకున్న బల్దియాకు ఇప్పుడు పెద్దమొత్తంలో అద్దె రూపంలో నిధులు సమకూర్చుకునే అవకాశముంటుందని బల్దియా భావిస్తున్నట్లు సమాచారం.

గతంలో బల్దియా ప్రజాప్రయోజనాల కోసం ఇతర శాఖలకు ఎలాంటి చార్జీల్లేకుండా ఇచ్చిన స్థలాలను ఆయా ప్రభుత్వ శాఖలు ఇప్పుడు కమర్షియల్ సంస్థలను నిర్వహించుకుంటున్నాయి. ఆర్థికంగా బలోపేతంగా ఉన్నపుడు మహానగరవాసులకు వివిధ రకాల సేవలందించే ఆర్టీసీ వంటి సంస్థలకు బల్దియా ఉచితంగా ఆస్తులనిచ్చినా, కష్టాలల్లో ఉన్న బల్దియాకు ఆర్థిక చేయూత నందించేందుకు ప్రభుత్వం గానీ, ఏ ఇతర ప్రభుత్వ శాఖ గానీ ముందుకు రాకపోవటం గమనార్హం. ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అద్దెకిచ్చే విషయమై సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు సమచారం.

బల్దియా ఆస్తులివి..

ప్రస్తుతం బల్దియాలో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం 3వేల స్థలాల్లో ఆస్తులున్నాయి. వీటిలో వివిధ మార్కెట్లలో 2,229 షాపులు ప్రధాన ప్రాంతాల్లో ఉండగా, 874 మలిగీలు వివిధ షాపింగ్ కాంప్లెకులున్నాయి. మరో 91 లీజు ల్యాండ్‌లున్నాయి. వీటిలో 1996లో కేవలం రూ.5 వేలు విలువ చేసిన భూమి ధర ఇప్పుడు రూ.2 కోట్లకు పెరిగిన భూములున్నాయి. 1988లో 18 ఎకరాల బల్దియా స్థలాన్ని కార్పొరేషన్ మహాత్మగాంధీ బస్ స్టేషన్ నిర్మాణం కోసం ఆర్టీసీకి ఇచ్చింది.

దీనికి సంబంధించి ఎలాంటి అద్దె కూడా బల్దియా ఆశించలేదు. ఈ స్థలంలో నగరవాసుల కోసం టాయిలెట్లు, హోటల్స్, డార్మెటరీలు నిర్మించాలని లీజులో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కానీ ఆర్టీసీ నేడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇక్కడి స్థలంలో క్యాంటీన్ లు, షాపులను, ఏటీఎంలను కూడా నిర్మించింది. బల్దియాకు చెందిన మరికొన్ని ఆస్తులు అన్యాక్రాంతమయ్యేందుకు కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు గతంలో బయటపడింది.

నేటికీ అక్రమార్కులైన కొందరు అధికారులు అద్దెలను వసూలు చేసుకుని లక్షల రూపాయలను తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించినా చర్యలెందుకు చేపట్టడం లేదన్నది హట్‌టాపిక్‌గా మారింది. దశాబ్దాల ప్రయత్నంరెవెన్యూలో కీలకంగా ఉండే టౌన్ సర్వే ల్యాండ్ రికార్డు (టీఎస్ఎల్ఆర్) ప్రకారం బల్దియా మొత్తం 275 భూములను లీజుకిచ్చినట్లు రికార్డుల్లో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం.

కానీ వీటిలో కేవలం 104 భూములకు సంబంధించిన భూముల రికార్డులను మాత్రమే బల్దియా గుర్తించింది. ఇందులో 50 భూములు సెంట్రల్ జోన్‌లో ఉన్నట్లు, మరో 32 నార్త్ జోన్‌లో ఉన్నట్లు గుర్తించింది. ఈ భూములు ప్రస్తుతం గజానికి రూ.లక్ష విలువ పలికే భూములున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీలో పూర్తి వివరాలున్నా, క్షేత్రస్థాయిలో భూములు అన్యక్రాంతమయ్యాయి.

2002లో తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2005లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో బల్దియా ఆస్తులకు సంబంధించిన రికార్డులపై తీవ్రస్థాయిలో చర్చ జరగటంతో అప్పట్లో రికార్డుల కోసం అధికారులు ప్రయత్నం చేసినట్టుగానే చేసి, అంతా మామూలేనన్నట్టు మౌనం వహించారు. ఆస్తులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా భద్రపర్చుకోకపోవటం, సరిగ్గా నిర్వహణ చేపట్టకపోవటానికి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణం కాగా, సిబ్బంది మరో కారణంగా చెప్పవచ్చు. బహిరంగంగా జీహెచ్ఎంసీ మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సుల అద్దెలను వసూలు చేసుకుని జేబులు నింపుకుంటున్నా, కనీసం ప్రశ్నించే వారే కరవయ్యారు.

Next Story

Most Viewed