దారుణం.. పెళ్లైన రెండు వారాలకే భార్య, అత్తను నరికి చంపిన అల్లుడు

by Disha Web Desk 4 |
దారుణం.. పెళ్లైన రెండు వారాలకే భార్య, అత్తను నరికి చంపిన అల్లుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లై రెండు వారాలైంది. ఇరుకుటుంబాల్లోనే కాదు ఇరు గ్రామాల్లో ఇంకా ఆ పెళ్లి విషయాన్ని మరచిపోలేదు. ఇక నవ వధువు కాళ్ల పారాణి సైతం ఇంకా ఆరనేలేదు. ఇంతలో కుటుంబ కలహాలు వచ్చాయి. పట్టుమని 14రోజులు కూడా గడవకముందే ఏకంగా భార్యను అడ్డువచ్చిన అత్తను కత్తితో నరికి చంపేశాడు. అంతేకాదు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామపైనా కత్తితో దాడికి తెగబడ్డాడు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో మామ కాస్త ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో కల్లూరు ఎస్టేట్‌లో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు లోని చింతల మునినగర్‌కు చెందిన శ్రావణ్‌‌ హైదరాబాద్‌లో ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. తెలంగాణలోని వనపర్తికి చెందిన వెంకటేశ్వర్లు(50) రమాదేవి(45) దంపతులు రుక్మిణి(21) అనే కుమార్తెతో కలిసి కర్నూలు నగరంలోని కల్లూరు సుబ్బలక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. రుక్మిణికి పెళ్లి కుదిరింది. రుక్మిణికి అదే ప్రాంతంలోని శ్రావణ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మార్చి 1న వనపర్తిలో కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా ఈ జంటకు పెళ్లి చేశారు.

పెళ్లైన రెండు రోజులకే శ్రావణ్ కుమార్‌కు ఇన్ఫెక్షన్‌ అయ్యిందని ఆపరేషన్ చేయాలని చెప్పి తండ్రి ప్రసాద్ హైదరాబాద్ తీసుకెళ్లాడు. అనంతరం మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి శ్రావణ్ కుమార్‌ను తండ్రి ప్రసాద్ ఇతర కుటుంబ సభ్యులు సుబ్బలక్ష్మీనగర్‌లోని అత్తింటికి తీసుకువచ్చారు. శ్రవణ్ ఇంటికి వచ్చిన 20 నిమిషాల వ్యవధిలోనే కుటుంబంలో గొడవ చెలరేగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన శ్రావణ్ తండ్రి ప్రసాద్ సహకారంతో భార్య రుక్మిణి, అత్త రమాదేవిలపై కూరగాయలు కోసే కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడిలో అక్కడికక్కడే భార్య రుక్మిణి అత్త రమాదేవిలు ప్రాణాలు విడిచారు. అయితే వారిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన మామ వెంకటేశ్వర్లుపైనా శ్రవణ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు108 ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెంకటేశ్వర్లును తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై డీఎస్పీ కేవీ మహేశ్, ఫోర్త్ టౌన్ సీఐ శివ శంకరయ్య, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు రామయ్య, పెద్దయ్య నాయుడులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed