ప్రశ్నాపత్రాల లీకేజీ..ఇంకా ఎవరికైనా అమ్మారా? అన్నదానిపై ఆరా

by Dishanational2 |
ప్రశ్నాపత్రాల లీకేజీ..ఇంకా ఎవరికైనా అమ్మారా? అన్నదానిపై ఆరా
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న ముగ్గరు నిందితులను సిట్​అధికారులు రెండవ రోజు కూడా నిందితులను విచారించారు. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపై వీరిని ప్రశ్నించినట్టు తెలిసింది. దాంతోపాటు ఇంకా ఎవరికైనా ఈ ప్రశ్నాపత్రాలు విక్రయించారా? అన్న కోణంలో విచారించినట్టు సమాచారం. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో విచారణను త్వరితం చేసిన సిట్​అధికారులు నాంపల్లి కోర్టు అనుమతితో మంగళవారం తిరుపతయ్య, రాజేందర్, ప్రశాంత్‌లను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదట ఈ ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నించిన సిట్​అధికారులు ఆ తరువాత ఒకేచోట కూర్చోబెట్టి విచారణ జరిపినట్టు సమాచారం.

మండలానికి చెందిన రాజేందర్​‌కు ఏఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పత్రాలను తానే ఇచ్చినట్టు తిరుపతయ్య అంగీకరించినట్టు తెలిసింది. పది లక్షల రూపాయలకు ఒప్పందం కుదిరిందని, అయిదు లక్షల రూపాయలు అడ్వాన్సుగా కూడా తీసుకున్నానని తిరుపతయ్య చెప్పినట్టు సమాచారం. ఇక, లీకేజీ కేసులో అరెస్టయిన లద్యావత్​డాక్యా బావమరిది రాజేశ్వర్​నాయక్​నుంచి నవవాబ్ పేటకు చెందిన ప్రశాంత్​ఏఈ సివిల్, జనరల్ ప్రశ్నాపత్రాలను అయిదు లక్షల రూపాయలకు కొన్నాడు. విచారణలో ప్రశాంత్​ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. కాగా, తాము ప్రశ్నాపత్రాలను మరెవ్వరికీ అమ్మలేదని ముగ్గురు నిందితులు చెప్పినట్టు సమాచారం. ఇక, గురువారానికి నిందితుల కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో నేటి సాయంత్రం సిట్​అధికారులు ఈ ముగ్గురిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.

Next Story