ఆ BRS ఎమ్మెల్యే నుండి ప్రాణహాని ఉన్నది.. కలకలం రేపుతోన్న వృద్ధ దంపతులు లేఖ..!

by Disha Web Desk 19 |
ఆ BRS ఎమ్మెల్యే నుండి ప్రాణహాని ఉన్నది.. కలకలం రేపుతోన్న వృద్ధ దంపతులు లేఖ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిల నుండి తమ కుమారుడికి ప్రాణ హాని ఉన్నదని, రక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వృద్ధ దంపతులు లేఖ రాయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్​టాపిక్‌గా మారింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామానికి చెందిన గాదె చిన్న కృష్ణారెడ్డి సావిత్రమ్మ వృద్ధ దంపతులు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

తమ కుమారుడిని అన్యాయంగా నిరాధార ఆరోపణలతో ఉద్యోగం నుండి తప్పించారని, ఉద్దేశ పూర్వకంగా నిరాధార కథనాలు రెండు పత్రికలలో వేసి, క్రిమినల్ కేసు సైతం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తనకున్న గౌరవానికి నష్టం చేశారని దానితో తన కుమారుడు ఆవేదన చెందుతున్నాడన్నారు. అవసాన దశలో వృద్ధాప్యంలో ఉన్న తాము దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నామని.. వెంటనే తగిన న్యాయం చేయగలరని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖలో రిక్వెస్ట్ చేశారు.

తమకు ఇద్దరు కుమారులని పెద్ద కుమారుడు 1997 సంవత్సరం లో రోడ్డు ప్రమాదంలో ఆకస్మాత్తుగా మరణించాడని.. అప్పటినుండి తన భార్య మానసికంగా బాధపడుతూ, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నదని లేఖలో పేర్కొన్నారు. ఒక్కగానొక్క కుమారుడు కష్టపడి చదువుకొని హైదరాబాద్‌లోని అనాధ విద్యార్థి గృహం సహకారంతో ఉన్నత విద్య అభ్యసించి వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలలో పనిచేసి 2016లో మహిళా శిశు సంక్షేమ శాఖ వరంగల్ జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగంలో ప్రవేశించాడని, ఉన్నతాధికారుల మన్ననలు పొంది పలు అవార్డు, రివార్డులు సైతం పొందాడని ఈ దంపతులు గుర్తు చేశారు.

ఉద్యోగ నిర్వహణలో కచ్చితంగా ఉండే తన కుమారుడికి ఒక తీవ్రమైన సమస్య వచ్చిందని, కార్యాలయంలో పని చేసే ఓ మహిళా ఉద్యోగి 2020లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు అప్పటి కలెక్టర్ హరిత షోకాజ్ నోటీసు జారీ చేశారన్నారు. తదుపరి చర్యలు తీసుకునేటప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవ రెడ్డి రెడ్డిలు తమ ప్రాబల్యంతో అడ్డుకొని తదుపరి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని, వెంటనే సదరు మహిళా ఉద్యోగి తన కుమారుని మీద అసత్య ఆరోపణలు చేసి ఫిర్యాదు చేసిందని.. తర్వాత కమిటీ వేసి, విచారణ చేసి తమ కుమారుడిది తప్పు లేదని తేలినా.. కలెక్టర్ చర్యలు తీసుకునే ముందు మళ్లీ పెద్ధి సుదర్శన్ రెడ్డి, వాసుదేవ రెడ్డిలు అడ్డుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయం పక్కదారి పట్టించినట్లు అర్థం అవుతుందన్నారు. సదరు విషయం అప్పటి కలెక్టర్ హరితకు మొత్తం తెలుసని లేఖలో తెలిపారు.

పసి పాప అమ్మకం అడ్డుకున్నందుకు పగ బట్టారా...

ప్రస్తుతము నా కుమారుడు విధి నిర్వహణలో భాగంగా నెక్కొండలోని ఓ తండాలో శిశువిక్రయాన్ని అడ్డుకున్నందుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ధి సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి పాపను వెంటనే అప్పజెప్పాలని చట్టం తర్వాత చూద్దామని, చట్ట ప్రకారం పద్ధతులు తర్వాత పాటించాలని ఫోన్‌లో తెలిపినట్లు పేర్కొన్నారు. కొంత సమయం కావాలంటే కూడా ఆగకుండా ఆదేశాలు జారీ చేశారని, రక్షించబడిన పాప విషయంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీదే తుది నిర్ణయం ఉంటుందని, కమిటీ సైతం ఎమ్మెల్యేకు కొంత సమయాన్ని ఇవ్వాలని కోరారని తెలిసిందన్నారు. గతం లో చర్యలు అడ్డుకొని వాళ్ళు కాపాడిన మహిళా ఉద్యోగినినే ప్రస్తుతం ఉసిగొల్పి ఫిర్యాదు చేయించి ఉద్యోగం తీసివేసి, క్రిమినల్ కేసు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు.

అమ్మకానికి గురై రక్షించబడిన పాపను తాను అడిగిన వెంటనే ఇవ్వక పోవడంతోనే మనసులో పెట్టుకొని మాట విననందుకే సదరు మహిళా ఉద్యోగినినే ప్రస్తుతం ఉసిగొల్పి జిల్లా కలెక్టర్‌కు వేధింపులు అంటూ ఫిర్యాదు చేయించి వ్యక్తిత్వం దెబ్బ తినే విధంగా కథనాలు వేసి టార్చర్​ చేస్తున్నారన్నారు. అప్పటినుండి తమ కుమారుడు ఆవేదన చెందుతూ ఇబ్బందులకు గురవుతున్నట్లు స్పష్టం చేశారు. తన భార్య అనారోగ్యంతో ఉంటే కుమారుడు లీవ్​లో ఉన్నా కూడా రాత్రికి రాత్రే పిలిచి ఉద్యోగ బాధ్యత నుండి తప్పించారని లేఖలో ఫిర్యాదు చేశారు. సెలవులో ఉన్నప్పటికీ ఒకే రోజు రిలీవింగ్ ఆర్డర్‌ను అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు అందచేశారన్నారు.



Next Story