ఏఈఓలకు ‘దశాబ్ది’ కష్టాలు.. ఒక్కో ఏఈఓకు రూ.లక్ష వరకు ఖర్చు

by Dishafeatures2 |
ఏఈఓలకు ‘దశాబ్ది’ కష్టాలు.. ఒక్కో ఏఈఓకు రూ.లక్ష వరకు ఖర్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయడంలో ఏఈఓ (వ్యవసాయ విస్తరణ అధికారి)లు కీలక భూమిక పోషించారు. ఇరవై ఒక్కరోజులు అప్పులు చేసి మరీ ఉత్సవాలు నిర్వహించారు. అప్పతెచ్చి మరీ ఒక్కొక్క ఏఈఓ సుమారు రూ.లక్షకు పైగా ఖర్చుచేశారు. ఉత్సవాలు ముగిసి నెలరోజులు గడుస్తున్నా నేటికీ బిల్లులు మంజూరు కాలేదు. తెచ్చిన డబ్బులకు వడ్డీ సైతం పెరుగుతుంది. బిల్లులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు చేసినా పరిష్కారానికి నోచడం లేదు. కలెక్టర్ వద్దే బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయని ఉన్నతాధికారులు సమాధానం ఇస్తున్నారు. దీంతో చేసేదేమీలేక ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల పేరిట గత నెల 2 నుంచి 22 తేదీ వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఘనంగా నిర్వహించింది. అయితే గ్రామాల్లో ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ఏఈఓలకు అప్పగించింది. 21 రోజులపాటు నిర్వహించిన ఉత్సవాల ఖర్చును మొత్తం భరించారు. ప్రభుత్వం ఇచ్చినదానికి అదనంగా ఉత్సవాలకు అప్పు చేసి మరీ నిర్వహించారు. గ్రామ జనాభాను బట్టి ఖర్చు చేశారు. ఒక్కొక్క ఏఈఓ సుమారు లక్షకు పైగా ఖర్చు చేశారు. కానీ నెలరోజులు గడుస్తున్నా నేటికీ బిల్లులు మంజూరు కాలేదు. ఈ రోజు ఎంత ఖర్చుచేశామనే వివరాలను సైతం సంబంధిత జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో లక్షల రూపాయలు అప్పు చేసి ఖర్చు చేయడంతో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వడ్డీ సైతం పెరుగుతుంది. ఒకవైపు బిల్లులు రాక, మరోవైపు వడ్డీ పెరుగుతుండటం, ఇంకోవైపు కుటుంబంపై సైతం ఒత్తిడి పెరుగుతుండటంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.

ఆందోళనకు సిద్ధమవుతున్న ఏఈఓలు

అప్పులు చేసి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన ఏఈఓలకు సరైన సమయంలో బిల్లులు రావడం లేదు. ఉత్సవాలకు ముందు బిల్లులు పెట్టిన వెంటనే మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఏఈలు ఉత్సవాల నిర్వహణకు ముందుకు వచ్చారు. అయితే నెల రోజులు గడుస్తుంది. అయినా మంజూరు కాకపోవడంతో విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేగాకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గోడును వెళ్లబుచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. చేతి నుంచి డబ్బులు ఖర్చుచేసి మనోవేధనకు గురవుతున్నామని పలువురు ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ల దగ్గరే పెండింగ్?

దశాబ్ది ఉత్సవాలకు అయిన ఖర్చును ఉత్సవాలు ముగిసిన రెండు మూడు రోజుల్లోనే అధికారులకు బిల్లులతో సహా అందజేశారు. అయితే వాటిని సంబంధిత అధికారులు కలెక్టర్ అప్రూవల్ కోసం పంపారు. అయినప్పటికీ నెల రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. ఉన్నతాధికారులను అడిగితే కలెక్టర్ దగ్గరే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏఈఓల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉన్నతాధికారులను ఒత్తిడి చేయలేక.. అప్పు ఇచ్చినవారికి సమాధానం చెప్పుకోలేక వారు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ఇదిలా ఉంటే ఏఈఓలు ఉత్సవాలకు ఖర్చుచేస్తే దాని క్రెడిట్ మాత్రం ప్రభుత్వం కొట్టేసింది. అయితే అందుకు కృషి చేసిన ఏఈఓ లను మాత్రం వినియోగించుకొని బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు బిల్లులు మంజూరు చేసేందుకు అధికారులు ఇప్పటికైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



Next Story

Most Viewed