ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అన్నదమ్ముల సిగపట్లు.. భట్టి యాత్రతో బయటపడ్డ విభేదాలు!

by Disha Web Desk 19 |
ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అన్నదమ్ముల సిగపట్లు.. భట్టి యాత్రతో బయటపడ్డ విభేదాలు!
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీని దశాబ్ధకాలం ఏకచత్రాధిపత్యంగా నడిపిన తూర్పు జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావుకు ఇంటిపోరు ఎక్కువైంది. తన రాజకీయ ఆరంగేట్రం మొదలుపెట్టిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గతం ఆయన ఏదంటే అదే అన్నట్లుగా నడిచింది. మాటే శాసనంగా నడిచిన ఆ నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు తన సొంత చిన్నాన్న కొడుకు, సోదరుడైన కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావుతో వర్గ పోరును ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

ప్రేమ్సాగర్ రావు చలువతోనే కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన విశ్వప్రసాద్ ప్రస్తుతం ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల కేంద్రంగా తూర్పు జిల్లా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంచిర్యాల నియోజకవర్గ నుంచే పోటీ చేసి ఓడిపోయిన ప్రేమ్ సాగర్ మరోసారి అక్కడి నుంచే పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వ ప్రసాద్రావుతో ఆయనకు పొసగడం లేదని తెలుస్తోంది.

భట్టి యాత్రతో విభేదాలు బహిర్గతం

కొంతకాలం నుంచి ఇద్దరి నడుమ విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్రతో బట్టబయలు అయ్యాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు విక్రమార్క సభలో ఇరు వర్గాలతో గొడవకు దిగి కొట్టుకునేదాకా వెళ్లాయి. రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. కొన్నిచోట్ల ప్రేమ్ సాగర్ వర్గీయుల ఫ్లెక్సీలు చింపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి వ్యతిరేకంగా విశ్వప్రసాద్ వర్గానికి చెందిన ప్రచార సామగ్రిని ప్రేమ్ సాగర్ వర్గీయులు చేసినట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

గతంలో ప్రేమ్ సాగర్ రావుకు కుడి భుజంగా ఉన్న విశ్వప్రసాద్ తాజాగా ఈ నియోజకవర్గంలో వర్గ పోరుకు తెరలేపడం తీవ్ర చర్చకు దారి తీసింది. విశ్వప్రసాద్ తన వర్గీయులతో ఆయన ఒక్కడి ఫోటో ఉన్న టీ షర్టులను ముద్రించి కార్యకర్తలను భట్టి సభకు తీసుకువచ్చారు. దీంతో కొంతకాలంగా గుంభనంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బయటపడింది.

టికెట్ వేట.. మూడు ముక్కలాట..!

ఇదిలా ఉంటే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ వ్యవహారమే గ్రూపు రాజకీయాలకు కారణమైందని చెబుతున్నారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అయిన ఈ స్థానం నుంచి ప్రేమ్ సాగర్ రావు శిష్యుడు ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పొందారు. ఆ తరువాత ఆయన గులాబీ పార్టీలు చేరారు అప్పటినుంచి ఈ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి ఎస్టీ అభ్యర్థి ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది ప్రేమ్ సాగర్ రావు తన వర్గీయుడు అయిన డాక్టర్ గణేష్ జాదవ్‌ను బరిలో ఉంచేందుకు నిర్ణయం తీసుకొని ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు.

దీన్ని విశ్వప్రసాద్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తన అభ్యర్థిగా కెరమెరి మండలం అనార్ పల్లి గ్రామ సర్పంచ్ శేషారావు ను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇరు వర్గాల నడుమ గొడవకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు వర్గాలే శనివారం జరిగిన భట్టి విక్రమార్క సమావేశంలో గొడవకు దిగాయి.

మరోవైపు మాజీ మంత్రి దివంగత భీమ్రావు కూతురు ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ ఎం సరస్వతి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు నేరుగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయని నియోజకవర్గంలో ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు వర్గాలుగా విడిపోయి గొడవలు చేస్తుంటే కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

Next Story

Most Viewed