మన్యంలో ఉద్రిక్తత.. ఉట్నూరు అటవీ డివిజన్ కార్యాలయ ముట్టడి ఆదివాసుల యత్నం!

by Satheesh |
మన్యంలో ఉద్రిక్తత.. ఉట్నూరు అటవీ డివిజన్ కార్యాలయ ముట్టడి ఆదివాసుల యత్నం!
X

దిశ ప్రతినిధి, నిర్మల్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ గొండ గ్రామానికి చెందిన ఆదిమ గిరిజనుడు కోవ లింబారావ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పొయ్యిల కట్టెల కోసం అడవికి వెళ్లిన ఆయనపై అటవీ అధికారులు విచక్షణారహితంగా దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తలతో పాటు ఇతర శరీర భాగాలపై లింభారావుకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆదివాసుల ఆందోళన..

లింబారావుపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే అరెస్టు చేయాలని ఆదిమ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. దాడి విషయాన్ని అటవీ అధికారులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా.. సంఘటన అంశాన్ని దిశ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఆదిమ గిరిజన సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళనను ఉదృతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఐటిడిఏ కేంద్రం అయిన ఉట్నూరును ముట్టడించారు. అక్కడి అటవీ డివిజనల్ కేంద్రంలోకి భారీగా తరలివచ్చిన గిరిజనులు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లను కట్టి వారిని అడ్డుకున్నారు. డీఎఫ్ఓ వారిని సముదాయించేందుకు ప్రయత్నం చేశారు. లింబరావుపై దాడి ఘటనలో బాధ్యులైన అటవీ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ఉట్నూరు చౌరస్తా నుంచి భారీగా అటవీ కార్యాలయం దాకా ర్యాలీని నిర్వహించారు. ఉట్నూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి బాధితుడి తరలింపు..

కాగా అటవీ అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆదిమ గిరిజనుడు లింభారావును హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సలు అందజేసేందుకు ఆయనను హైదరాబాద్ తరలించినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై అటవీశాఖ యంత్రాంగం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరా తీశారు. ఆదిలాబాద్ చీఫ్ కన్జర్వేటర్‌తో మాట్లాడి సమాచారాన్ని తెలుసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. అయితే బాధితుడికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించినట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి.

సంఘటనను వెలుగులోకి తెచ్చిన ''దిశ''

ఈ సంఘటనను దిశ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. లింభారావుపై అటవీ అధికారుల దాడి వ్యవహారం తర్వాత విషయాన్ని బయటకు పొక్కనేయకుండా అటవీ అధికారులు జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. బాధితుడు తీవ్ర గాయాలతో చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఘటనపై దిశ డైనమిక్ ఎడిషన్లో కథనం ప్రచురించింది. దీంతో అటవీశాఖ యంత్రాంగం ఉన్నత స్థాయిలో స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించింది. అలాగే బాధితున్ని మెరుగైన చికిత్స కోసం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed