మాస్టర్ ప్లాన్ రద్దు చేసేదాకా ఆందోళన ఆగదు..

by Disha Web Desk 20 |
మాస్టర్ ప్లాన్ రద్దు చేసేదాకా ఆందోళన ఆగదు..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ పురపాలక సంఘం కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేసేదాకా ఆందోళన కొనసాగిస్తామని నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ప్రకటించారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన బంధువులు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తదితరులు తమకు అనుకూలంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ తయారు చేశారని ఆరోపించారు. పెద్దలను మరింత పెద్దలను చేసే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నస్థలాలను రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చారని విమర్శించారు. పేదలకు చెందిన వ్యవసాయ భూములను ఇండస్ట్రియల్ జోన్ లోకి మార్చి భవిష్యత్తులో వారిని అగమ్య గోచారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కోట్ల రూపాయల విలువైన భూములకు ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ భూములు అన్ని మంత్రి బంధువులకు చెందినవేనని విమర్శించారు. అధికారులు మంత్రి ఒత్తిడికి ఇస్తారాజ్యంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారని ఆరోపించారు. రైతులందరితో కలిసి నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ఉద్యమ కార్యాచరణం తయారు చేస్తున్నామని చెప్పారు. పేదలను పట్టించుకోకుండా మంత్రి ఆయన బంధుగణం తమ భూములను కోట్లకు పడగలెత్తేలా మాస్టర్ ప్లాన్లు చేర్చుకున్నారని విమర్శించారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. రద్దు చేసేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రావుల రామనాథ్, మల్లికార్జున్రెడ్డి అయ్యన్న గారి భూమయ్య పాల్గొన్నారు.


Next Story

Most Viewed