పార్టీ విస్తరణకు కేసీఆర్ 'స్థానిక' వ్యూహం..

by Hamsa |   ( Updated:2023-02-13 03:03:57.0  )
పార్టీ విస్తరణకు కేసీఆర్ స్థానిక వ్యూహం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్: రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్రలోనూ తెలంగాణ ఫార్ములా అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో త్వరలో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించే ముందు కూడా కేసీఆర్ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేశారు. తొలుత డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిద్దిపేట ఉప ఎన్నికకు వెళ్లారు.

ఆ విజయం తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పనులు ప్రారంభించారు. అదే సమయంలో వచ్చిన జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. నిజామాబాద్, కరీంనగర్ జడ్పీ చైర్మన్ పదవులతో పాటు అనేక చోట్ల ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేసింది. అప్పటి నుంచి తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ నిలిచింది. ఆదివారం నాందేడ్‌లో నిర్వహించిన అగ్రశ్రేణి నాయకులు ఎవరూ బీఆర్ఎస్ లో చేరలేదు. నాందేడ్, పరిసర జిల్లాలకు చెందిన సర్పంచులు, కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. వీళ్లకు మహారాష్ట్రలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున జడ్పీటీసీలుగా పోటీ చేసే అవకాశం కల్పిస్తానని కేసీఆర్ సంకేతాలిచ్చారు. ఫలితంగా గ్రామాల్లో పార్టీని విస్తరించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.

మహారాష్ట్రలో మరిన్ని సమావేశాలు..

మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు నిర్వహించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు చొరవ తీసుకొని కేసీఆర్ ద్వారా సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, ముంబై తదితర నగరాల్లో సభలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. పార్టీ ప్రచార వాహనాలు రాష్ట్రంలోని 288 నియోజక వర్గాల నుంచి ఒకే రోజు బయల్దేరతాయని వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మొత్తానికి మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని చాపకింద నీరులా విస్తరించేందకు ఇదే అదనుగా కేసీఆర్ నిర్ణయించారని సమాచారం.

Advertisement

Next Story