సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం

by Disha Web Desk 15 |
సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం
X

దిశ, ఆదిలాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం 285 వ జయంతి ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రాంలీలా మైదాన్ లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై బొగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలను ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా ఒక పండగలా అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జయంతి వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.

హింస, మత్తు , ధూమ పానాలకు దూరంగా ఉండాలని హితువు పలికి యావత్ ప్రజానికానికి ఆదర్శంగా నిలిచారని , బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి అని, గిరిజనులకు ఆదర్శప్రాయుడే కాకుండా దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సమాజ శ్రేయస్సు కోసం సంత్‌ సేవాలాల్‌ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ మహారాజ్ త‌న బోధ‌నల వల్ల బంజారా జాతి పురోగమించడానికి ఎంతో కృషి చేశార‌ని పేర్కొన్నారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ సంత్ సేవాలల్ మహరాజ్ చూపిన మార్గంలో పయనించి, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ వేడుకలకు హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ అందరికీ ఆదర్శ ప్రాయుడే కాకుండా దైవ సమానుడని అన్నారు. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం శుభసూచకం అని తెలిపారు. ఎమ్మెల్యే జాదవ్ అనిల్,వెడ్మ బొజ్జూ పటేల్ లు మాట్లాడుతూ సేవాలాల్ ప్రజల మేలుకోసం అనేక ఉద్యమాలు చేశారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బోధించేవారని తెలిపారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ నగేష్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాథోడ్ సురేష్, జనరల్ సెక్రెటరీ బానోత్ గజానంద్, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేక వాహనాల్లో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Next Story

Most Viewed