మెడికల్ కాలేజీల ప్రారంభం సాధ్యమేనా..?

by Disha Web Desk 20 |
మెడికల్ కాలేజీల ప్రారంభం సాధ్యమేనా..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : 2023- 24 విద్యా సంవత్సరంలోనే కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభం కావాల్సింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తనిఖీ బృందాలు వచ్చేలోగా అవసరమైన వైద్య సిబ్బంది నియామకాలు ప్రొఫెసర్ల నియామకాలు పూర్తి చేయాలని అలాగే కొత్త భవనాల నిర్మాణం కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒకవైపు భవనాల నిర్మాణం వేగంగా సాగుతున్నప్పటికీ నియామకాల ప్రక్రియ పైనే అనుమానాలు కలుగుతున్నాయి. అన్ని ఆశించినట్టు జరిగితే కళాశాలల ప్రారంభం సాధ్యమవుతుందని చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కళాశాల ప్రారంభానికి బ్రేక్ వేస్తుందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

వేగంగా భవనాల నిర్మాణం...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆదిలాబాద్ లో రిమ్స్ మంచిర్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నడుస్తున్నాయి. కొత్తగా నిర్మల్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. ప్రస్తుతానికి జిల్లా కేంద్ర ఆస్పత్రులలోనే మెడికల్ కాలేజీల అడ్మినిస్ట్రేటివ్ వింగ్ శాఖలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో మెడికల్ కాలేజీల స్వరూపం రావాలంటే కళాశాల భవనాలు పూర్తి కావాల్సి ఉంది. అయితే నిర్మల్ లో మాత్రం కళాశాల భవన నిర్మాణం పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి.

సిబ్బంది ప్రొఫెసర్ల నియామకం పూర్తయ్యేనా..

మెడికల్ కళాశాలల నిర్వహణకు అనుమతి లభించాలంటే కచ్చితంగా ప్రొఫెసర్ల నియామకంతో పాటు ఆసుపత్రి నిర్వహణలో కీలకమైన స్టాఫ్ నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా ఎందుకు సంబంధించిన పనులు జరగడం లేదు నిర్మల్ మెడికల్ కాలేజీకి గత వారం రోజుల క్రితమే కళాశాల ప్రిన్సిపాల్ ను నియమించగా డాక్టర్ జేవీడీఎస్ ప్రసాద్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పై అంతస్తులో ఒక గదిలో మాత్రమే ఉండి తన బాధ్యతలు చూస్తున్నారు. ఆయనకు పరిపాలన పరమైన సిబ్బందిని ఇంకా కేటాయించలేదు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో నైతే ఇంకా ప్రిన్సిపాల్ నియామకం కూడా జరగలేదు. అక్కడికి వెళ్లేందుకు ఎవరు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. మరోవైపు కాలేజీ ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ తక్షణమే ఆచరణ రూపం దాల్చడం కష్టమేనని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి హరీష్ రావు త్వరలోనే ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేస్తామని ప్రకటించడంతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇతర పారామెడికల్ సిబ్బంది పరిపాలన వ్యవహారాలు చూసే యంత్రాంగం నియామకాలు ఇంకా చేపట్టలేదు.

గడువు సమీపిస్తోందని ఆందోళన...

మెడికల్ కళాశాలలో ప్రారంభం గడువు సమీపిస్తుండడం వల్లనే ఈ ఏడాది తరగతులు ప్రారంభం అవుతాయా కాదా అన్నది కొంత అనుమానంగా కనిపిస్తోంది. జూన్ లేదంటే జూలై మాసంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయి. అంటే గరిష్టంగా మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంది ఈ లెక్కన కళాశాలల భవనాల నిర్మాణం సిబ్బంది నియామకాలు మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి వసతులు అప్పట్లోగా పూర్తవుతాయా అన్నది అనుమానంగా కనిపిస్తోంది.

ఎన్ఎంసీ కొర్రీ వేస్తే...

మెడికల్ కళాశాలలో తరగతుల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదముద్ర తప్పనిసరి త్వరలోనే ఆ కమిటీ బృందాలు కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి తనిఖీలకు వస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు కూడా త్వరలోనే ఎన్ఎంసీ బృందాలు వస్తున్నట్టు సూచనప్రాయంగా తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పనులు వేగంగా చేపట్టాలని మంత్రి హరీష్ రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం పనులు ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదని భవన నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సిబ్బంది నియామకాల విషయంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లోగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందాలు వచ్చి కొర్రీలు వేస్తే ఈ ఏడాది తరగతులు నిర్వహించడం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వైద్య శాఖ వర్గాల్లో ఉన్నాయి.

Next Story

Most Viewed