పార్టీ మారి ప‌త్తాలేని నేత‌లు.. బీఆర్ఎస్‌లో చేరి త‌ల‌లు ప‌ట్టుకుంటున్న నాయ‌కులు

by Disha Web Desk 1 |
పార్టీ మారి ప‌త్తాలేని నేత‌లు.. బీఆర్ఎస్‌లో చేరి త‌ల‌లు ప‌ట్టుకుంటున్న నాయ‌కులు
X

దిశ, అదిలాబాద్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఆ పార్టీలో టిక్కెట్ సంపాదిస్తే చాలు ఎమ్మెల్యే అయిపోవచ్చు. ఏదో ఒక చైర్మన్ పోస్టు కొట్టేయచ్చు.. ఇవి అసెంబ్లీ ఎన్నికల ముందు కొందరు నేతల ఆలోచనలు. కానీ, ఇప్పుడు అవే ఆలోచనలు తలకిందులై నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో పార్టీ మారిన వారు ఆ పార్టీలో ఎందుకు చేరాం రా.. భగవంతుడా అని బాధపడుతున్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా పరవాలేదు అనుకుంటే ఆ పార్టీలో నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని స్థితిలో నేతలు కొట్టుమిట్టాడుతున్నారు.

నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు ర‌మాదేవికి ఆ పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా రామారావు పటేల్‌‌కు బీఫాం ఇవ్వడం‌తో ఆమె బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖానాపూర్‌ టికెట్‌ రమేశ్‌రాథోడ్‌కు ఇవ్వడంతో పెంబి జడ్పీటీసీ భూక్య జానూబాయి సైతం బీఆర్ఎస్‌లో చేరారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌భ్యుడు, నిర్మల్ మాజీ మున్సిప‌ల్ చైర్మన్ అప్పాల గ‌ణేష్ సైతం బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే అక్కడ బీజేపీ ఘన విజ‌యం సాధించింది. తాను బీజేపీలో ఉన్నా.. బాగుడేంది క‌దా.. అని గణేస్ మథనపడుతున్నట్లు స‌మాచారం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాక‌పోవ‌డంతో ఆసిఫాబాద్ నేత మ‌ర్సుకోల స‌ర‌స్వతి సైతం బీఆర్ఎస్ బాట ప‌ట్టారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ విజ‌యం సాధించినా ఆమెకు ప్రత్యేకంగా ఒరిగింది లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకుని ఉంటే ప్రభుత్వ హ‌యాంలో ఏదైనా ప‌ద‌వి ద‌క్కి ఉండేద‌ని ఆమె అనుచ‌రులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలో చేరినా.. బీ ఫాం రాకపోయే

ఇక‌, అసెంబ్లీ ఎన్నిక‌లకు కేవలం 15 రోజుల‌ ముందు బోథ్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ కీలక నేత వన్నెల అశోక్ హస్తం పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మొద‌ట బోథ్ నియోజ‌కవ‌ర్గ టికెట్ ఆయ‌న‌కే కేటాయించారు. దీంతో ఆయన ప్రచారం కూడా మొద‌లెట్టారు. కానీ, మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న‌కు బీ ఫాం ఇవ్వకుండా ఆడె గజేందర్‌కు ఇచ్చారు. దీంతో ఆయ‌న బీఆర్ఎస్‌లో చేరారు. ఆయ‌న‌కు సైతం మంచి ప‌ద‌వి ల‌భించి ఉండేద‌ని, తొంద‌ర‌ ప‌డి కాంగ్రెస్‌ను వీడార‌ని ప‌లువురు భావిస్తున్నారు. మ‌రోవైపు పార్టీలు మార‌డంలో రికార్డు స్థాపించిన మాజీ మంత్రి బోడ జ‌నార్ధన్ సైతం ఎన్నిక‌ల్లో చివ‌రి స‌మ‌యంలో పార్టీ మారారు. చెన్నూరు నుంచి టికెట్ ఆశించిన భంగ‌ప‌డిన ఆయ‌న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా చాలా మంది ద్వితీయ శ్రేణి నాయ‌కులు సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు.

రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందనే..

ఎన్నికల సందర్భంగా పార్టీ మారిన నేతలంతా త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్యత్తు ఉంటుంద‌నుకుని బీఆర్ఎస్‌లో చేరారు. కానీ, అనూహ్యంగా ఆ పార్టీ ఓడిపోవడంతో అందులో చేరిన వారంతా బాధ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి, లేక చైర్మన్ ప‌ద‌వి వ‌చ్చేది క‌దా..? ఇప్పుడు ఏటూ కాకుండా రాజ‌కీయ భ‌విష్యత్తు అగ‌మ్యగోచ‌రంగా త‌యారైందంటూ పులువురు నేతలు త‌మ అనుచ‌రుల వ‌ద్ద వాపోతున్నారట‌. తాము ఒక‌టి త‌లిస్తే.. దైవ‌మొకటి త‌ల‌చినట్లుగా త‌యారైంది పార్టీ మారిన వారి పరిస్థితి.



Next Story

Most Viewed