అధికారుల అండదండలతో బుసలు కొడుతున్న రియల్ మాఫియా..

by Disha Web Desk 20 |
అధికారుల అండదండలతో బుసలు కొడుతున్న రియల్ మాఫియా..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా, చెన్నూరు పట్టణంలోని మేజర్ గ్రామపంచాయతీనీ జనాభా రీత్యా స్థానిక ఎమ్మెల్యే బాల్కసుమన్ చొరవతో గత మూడున్నర సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత నుండి భూముల రేట్లు అడ్డగోలుగా పెరగడంతో రియల్ మాఫియాకు ఇదే అదునుగా భావించి ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములపై తమ కన్ను పడింది. ఇదే సమయంలో కొంతమంది లంచగొండి ఆఫీసర్లు తోడవడంతో ప్రభుత్వ భూములలో అక్రమంగా వెంచర్లు చేసి క్రయవిక్రయాలు జరుపుతూ కోట్లు గడిస్తున్నారు. చెన్నూర్ పురపాలక పట్టణ పరిధిలోని గెర్రె ప్రాంతంలో ప్రభుత్వ అసైన్డ్ లావనిపట్టా భూములను.. పట్టా భూములుగా చిత్రీకరించి అక్రమ స్థిరాస్తిగా మార్చుకుంటున్నారు.

పట్టణానికి చెందిన కొంతమంది భూ మాఫియా, రియల్టర్స్ గ్రూపుగా ఏర్పడి అక్రమ వెంచర్లు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న విషయాన్ని పట్టణానికి చెందిన కొంతమంది సామాజికవేత్తలు ఎన్నోసార్లు పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. అక్రమ స్థిరాస్తి వ్యాపారుల పై అసైన్డ్ భూ బదలాయింపు చట్టం 1977 ప్రకారం క్రయ విక్రయదారుల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని పట్టణ ప్రజల విమర్శిస్తున్నారు. బస్సు డిపో, వంద పడకల ఆసుపత్రి, జర్నలిస్టు కాలనీల ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే కృషి చేస్తు ప్రభుత్వ భూముల కోసం ఆరా తీస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం ప్రభుత్వ భూములు లేవని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేతులుదులుపుకుంటున్న విషయం పట్టణ ప్రజలకు విధితమే.

మున్సిపాలిటీగా ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆరుగురు కమిషనర్లు మారడం చెన్నూరు మున్సిపాలిటీలో అవినీతి బాగోతం ఎలా తాండవిస్తుందో ప్రజల గమనిస్తున్నారు. కొంతమంది అధికారులు ఓపెన్ ప్లాట్ లకు ఇంటి నెంబర్లు కేటాయిస్తూ లంచాలు గుంజుతున్నారని స్వయంగా ఒక కౌన్సిలర్ పత్రిక ప్రకటనలో విమర్శించడం అధికారుల పనితీరును గుర్తుచేస్తుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ శ్రద్ధవహించి లావని పట్టా భూములలో అక్రమంగా వెంచర్లు చేస్తున్న భూ మాఫియా, రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చేతులు మారిన అసైన్డ్ లావాని భూములను ప్రభుత్వం స్వాధీన పరచుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed