జోరుగా రేషన్ బియ్యం దందా

by Disha Web Desk 15 |
జోరుగా రేషన్ బియ్యం దందా
X

దిశ, వేమనపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ దందాకు తెరలేపుతుంది. దరిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత పథకం కింద కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నేడు అక్రమార్కులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. నిరుపేదలకు పంపిణీ చేసే దొడ్డు బియ్యం నాసిరకంగా పురుగులు చెత్తాచెదారం ఉండడంతో ప్రజలు తినడానికి ఆయిష్టత చూపుతున్నారు. దాంతో సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో బియ్యానికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో లబ్ధిదారుల నుండి 6 నుండి పది రూపాయల వరకు కొనుగోలు చేసి ట్రాలీలలో యథేచ్ఛగా సరిహద్దుల్లోని మహారాష్ట్రకు తరలించి అక్కడ కిలోకు 50 రూపాయలకు పైగానే అక్రమార్కులు సంపాదిస్తున్నారు.

రేషన్ దందా జోరుగా సాగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కొంతమంది అధికారులు అయితే బియ్యం రవాణా చేసే ముఠాల నుండి డబ్బులు తీసుకొని తమకేం పట్టనట్లు వ్యవహరించడంతోనే స్వరాష్ట్రంలోని బియ్యం మహారాష్ట్రలో సన్నబియంగా మార్చి దందాను కొనసాగిస్తున్నారు. కొంతమంది రేషన్ డీలర్లే స్వయంగా లబ్ధిదారుల నుండి బియ్యాన్ని కొని రేషన్ ముఠాలకు అమ్మకాలు జరుపుతున్నారు. లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసిన బియ్యాన్ని నేరుగా రైస్​ మిల్లుల్లోకి తీసుకువెళ్లి వాటికి సన్నబియంగా మార్పు చేసి మహారాష్ట్రలో జోరుగా దందాను కొనసాగిస్తున్నారు.


Next Story

Most Viewed