కూతురిని ప్రేమిస్తున్నాడని కడతేర్చాడు.. మేనమామే నిందితుడు

by Disha Web Desk 1 |
కూతురిని ప్రేమిస్తున్నాడని కడతేర్చాడు.. మేనమామే నిందితుడు
X

దిశ, లక్షెట్టిపేట: విషం కలిపిన బీరు తాగి మృతి చెందినట్లుగా భావిస్తున్న దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుడ్డంగుల అనిల్ అనే యువకుడి మృతి కేసు మిస్టరీ వీడింది. అదే గ్రామానికి చెందిన దారంగుల రాజమౌళి, మృతుడికి మేనమామ బీరులో గడ్డి మందు కలిపి యువకుడికి బలవంతంగా తాగించి మృతికి కారకుడయ్యాడని పోలీసుల విచారణలో తేలింది.

మంగళవారం సాయంత్రం లక్షెట్టిపేట సీఐ కృష్ణారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. గూడెం గ్రామానికి చెందిన మృతుడు అనిల్ అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయిన రాజమౌళి కూతురిని ప్రేమిస్తున్నాడు. ఇది తెలుసుకున్న నిందితుడు ఆ యువకుడిపై కక్ష గట్టి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న యువకుడిని కలిసి యోగక్షేమాలు విచారించి దావత్ చేసుకుందామని ఒప్పించాడు.

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల శివారు టేకు చెట్ల వద్దకు వెంట బీర్లు తీసుకెళ్లి మందు పార్టీకి కూర్చున్నారు. మద్యం మత్తులో యువకుడు ఉండడాన్ని గమనించిన అతడు అప్పటికే సగం ఖాళీ అయిన బీరు సీసాలో గడ్డి మందు కలిపాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తిని ఒక్కసారిగా యువకుడి మెడ పై పెట్టి బీరు తాగాలని, లేకపోతే ఇక్కడే చంపేస్తానని బెదిరించాడు.

దీంతో భయపడి మృతుడు ఆ బీరు తాగడంతో వదిలిపెట్టాడు. మద్యం మత్తులో ఇంటికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సిఫారసు మేరకు కరీంనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ చేర్పించారు.

చికిత్స పొందుతున్న సమయంలో ఇచ్చిన మరణ వాంగ్మూలంలో తనకు మెడపై కత్తి పెట్టి బీరులో ఏదో విషం కలిపి బలవంతగా తాగించారని పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, చికిత్స పొందుతూ ఈనెల 16 రాత్రి మృతి చెందాడు. అయితే తన కొడుకు మృతి పై అనుమానాలు ఉన్నాయని తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు విచారణలో రాజమౌళిని నిందితుడిగా గురించి అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed