కర్షకులకు కరెంట్‌ కష్టాలు.. భూగర్భ జలాలు ఉన్నా వాడుకోలేని దుస్థితి

by Disha Web Desk 23 |
కర్షకులకు కరెంట్‌ కష్టాలు.. భూగర్భ జలాలు ఉన్నా వాడుకోలేని దుస్థితి
X

దిశ,చింతలమానేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం 6 గంటలకు మించి త్రీ ఫేజ్‌ కరెంట్‌ సరఫరా కావడం లేదని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని రన్వెల్లి గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.రాత్రి వేళలో కరెంట్‌ ఇవ్వడంతో రైతులు మళ్లీ బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్‌శాఖ పరిధిలో ప్రతి రోజూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు రాత్రి వేళలో విద్యుత్‌ సరఫరా జరుగుతుందని విద్యుత్ అధికారులు ప్రకటించారు. వాస్తవానికి 6 గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా అవుతుండడంతో పొలాలకు చివరి మడి తడిసే పరిస్థితి లేదని వరి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో ఆశించినంత మేర సాగునీరు అందుబాటులో ఉన్నా కరెంట్‌ సరఫరా అంతరాయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం రైతులను వెంటాడుతోంది.

6 గంటలు కూడా ఇవ్వడం లేదు..: జటోత్ సోమేశ్,రైతు , రన్వెళ్లి

రాన్వెల్లి శివారులో 6 ఎకరాల్లో వరి పంటలను సాగు చేస్తున్నాను. మండలానికి సాగునీటి సౌకర్యం అంతంతమాత్రమే బోరు బావుల కిందనే పంటను సాగు చేస్తున్నాం. 6 గంటలు కూడా విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేయడం లేదు. ఈ 6 గంటల కరెంట్‌ కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. లైన్‌మెన్‌లు, విద్యుత్‌ అధికారులు వాట్సాప్‌గ్రూప్‌లో మెసేజ్‌ పెడితేగాని కరెంట్‌ సరఫరా అవుతుందా లేదా తెలియడం లేదు. నిరంతరం విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందక ఎండిపోతున్నాయి. ఒక నెల నుంచి త్రీఫేస్ కరెంట్ రావడం లేదు.

విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి : జాటోత్ రవి,రైతు,రన్వెల్లి

వ్యవసాయానికి అధికారులు త్రిఫేజ్‌ కరెంటును 6 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని ఆ 6 గంటల విద్యుత్‌ సరఫరాలోనూ కోతలు విధిస్తున్నారు. దీంతో పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం ఎండలు ముదరనందున పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. విద్యుత్‌ కోతలు రానురాను ఇలానే ఉంటే ఎండలు ముదిరే సమయంలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 12 గంటల విద్యుత్‌ను కోతలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేస్తే పంటలు బతికే అవకాశం ఉంటుంది.


Next Story

Most Viewed