‘మండలి’కి మొండి చెయ్యి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ దక్కడం కష్టమే

by Dishanational2 |
‘మండలి’కి మొండి చెయ్యి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ దక్కడం కష్టమే
X

శాసనమండలిలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్యే కోటా సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ బెర్త్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు యత్నాలు మొదలుపెట్టారు. పదిమందికి పైగా ఉమ్మడి జిల్లా నేతలు ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రమైన ఆశలు పెట్టుకున్నారు. మూడుస్థానాలు భారత రాష్ట్ర సమితి పార్టీకే దక్కనుండగా తమకు అవకాశం వస్తుందా.. అన్న ఆశ ఆదిలాబాద్ జిల్లా నేతల్లో నెలకొంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నతస్థాయి రాజకీయ పదవుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు ఈ సారైనా తమకు అవకాశం దక్కకుండా పోతుందా అన్న ఆశతో ఉన్నారు. అయితే పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు ఎవరికి ఆ అవకాశం ఇచ్చేలా లేరని పార్టీ వర్గాలు కుండబద్దలు కొడుతున్నాయి. దీంతో రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని అదేపార్టీలో కొనసాగుతున్న సీనియర్లలో నైరాశ్యం కమ్ముకుంటున్నది.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఉన్నతస్థాయి రాజకీయ పదవుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్లు ఈ సారైనా తమకు అవకాశం దక్కకుండా పోతుందా అన్న ఆశతో ఉన్నారు.

పశ్చిమ జిల్లా సీనియర్లలో నిరాశ..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల నేతలు శాసనమండలి స్థానంపై గత కొంతకాలంగా ఆశతో ఉన్నారు పార్టీ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన సీనియర్లు ప్రతిసారి శాసనమండలి నోటిఫికేషన్ సమయంలో తమకు అవకాశం దక్కకుండా పోతుందా అని వేచి చూస్తూనే ఉన్నారు. అయితే ఈసారి కూడా అదే నిరాశ తప్పదని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఆలోచనకు నిర్మల్ బీజం వేసిందని అనేకసార్లు చెప్పిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంతగానే ఉండేది. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన నిర్మల్ నేత కే శ్రీహరి రావు పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆయన జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్మల్ నియోజకవర్గంలో పాటు పశ్చిమ ప్రాంతంలోని ముధోల్ ఖానాపూర్ బోత్ ఆదిలాబాద్ సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేశారు.

ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు జోగు రామన్న విట్టల్ రెడ్డి మాజీ ఎంపీ జి నగేష్ తదితరులను బీఆర్ఎస్‌లోకి తీసుకురావడం వెనుక శ్రీహరి రావు కృషి ఉంది. ఆయన నిర్మల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఓటమి చవిచూసినప్పటికీ పార్టీ నిర్మాణంతోపాటు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మంత్రి కేటీఆర్ అనేకసార్లు ప్రామిస్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పిస్తానని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ అది కార్యరూపం దాల్చకపోవడంతో శ్రీహరి రావు తీవ్రంగా అంతర్మదన పడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వీ సత్యనారాయణ గౌడ్ సైతం ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. 2015లో ఆయన సతీమణి శోభారాణికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. మరోసారి నిర్మల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అవకాశం వచ్చినప్పటికీ ఆయన చేజార్చుకున్నారు.

ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ ఆయనకు గతంలో హామీ ఇచ్చారని ఆ కారణంగానే జడ్పీ చైర్మన్ పదవిని ఇతరులకు వదిలిపెట్టినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే ఆయనకు లోకల్ బాడీస్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని, చివరలో దండే విట్టల్ ఆ అవకాశాన్ని తన్నుకుపోయారని అప్పటినుంచి సత్యనారాయణ గౌడ్ నిరాశతో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు ఎమ్మెల్సీ అవకాశం రాకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అడ్డుపడ్డాడని అనేక సందర్భాల్లో తన అనుయాయుల వద్ద వాపోతున్న సత్యనారాయణ గౌడ్ ఇటీవల కొంత కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నారని కూడా ప్రచారం ఉంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జి నగేష్ కూడా తనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎస్టీ కోటాలో తన పేరును పరిశీలించాలని ఆయన అధిష్టానం వద్దకు వెళ్లి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే బోథ్ నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే బాపురావు తో ఆయనకు పొసగడం లేదు.

Next Story

Most Viewed