మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: హోం మంత్రి మహమూద్ అలీ

by Disha Web Desk 1 |
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: హోం మంత్రి మహమూద్ అలీ
X

దిశ, ప్రతినిధి నిర్మల్: మైనారిటీల సంక్షేమం కోసం తమ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చించోలి వద్ద నూతనంగా నిర్మించిన ఈద్గా ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మతాలకతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో పాల్గొంటున్న మైనారిటీలు అన్ని వర్గాలతో కలిసి ఉండాలని సూచించారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే సీఎం కేసీఆర్ మైనారిటీలకు కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని గమనించాలన్నారు.

రాజకీయం చేయడం తగదు... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ నియోజకవర్గంలో అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనకుండా.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈద్గా ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చించోలి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈద్గా నిర్మాణంపై కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఇది తగదన్నారు. అటవీ భూమి నష్టపోతున్నందున ముథోల్ నియోజకవర్గం లో అటవీ శాఖకు 20 ఎకరాలు అదనంగా కేటాయించామన్నారు.

మౌలిక వసతుల విద్య కోసం మరో చోట మూడు ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించామన్నారు. కొందరు పని గట్టుకుని విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఈద్గా నిర్మాణాన్ని రాజకీయం చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు దీన్ని గమనించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed